గొడ్డేటి మాధ‌వి గ‌త యేడాది లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఈ పేరు పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌దు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆమె అర‌కు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన‌ప్పుడు కూడా ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆమె ఏకంగా 1.50 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో గెలిచిందో ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆమె ఆక‌ర్షించింది. భారతదేశ 17వ లోక్‌సభలో లోక్‌సభ సభ్యురాలు అయిన మాధ‌వి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పిన్నవయసు గల పార్లమెంటు సభ్యురాలు.



మాధ‌వి 1992లో విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో గొడ్డేటి దేముడు, చెల్లయమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి కమ్యూనిస్టు నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. తల్లి చెల్లయమ్మ సెకండరీ గ్రేడు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. దేముడు గ‌తంలో సీపీఐ నుంచి ర‌ద్ద‌యిన చింత‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. నిజాయితీ క‌ల నాయ‌కుడిగా ఆయ‌న‌కు మంచి పేరు ఉంది. పాయ‌క‌రావుపేట ప్ర‌కాష్ కాలేజ్లో చ‌దివిన ఆమె అక్క‌డే ఉద్యోగం చేస్తుండ‌గా అనుకోని రీతిలో జ‌గ‌న్ పిలిచి ఆమెకు అర‌కు ఎంపీ సీటు ఇచ్చారు.



పైగా ఎన్నిక‌ల్లో ఆమె మాజీ కేంద్ర మంత్రి రాజ‌కీయ కురువృద్ధుడు అయిన వైరిచ‌ర్ల కిషోర్ చంద్ర‌దేవ్‌పై భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఓ వైపు కిషోర్ చంద్ర‌దేవ్ టీడీపీ నుంచి.. ఆయ‌న కుమార్తె కాంగ్రెస్ నుంచి పోటీ చేయ‌గా ఇద్ద‌రిని మాధ‌వి ఓడించారు. ఇక తన తండ్రిలాగా తాను ఒక ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉంటుందని భావించి రాజకీయాల్లోకి రావాలని తాను నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది.



కేవలం 25 ఏళ్ల 3 నెలల వయసుకే ఎంపీగా ఎన్నికై లోక్‌సభ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన ఎంపీగా కూడా ఆమె తిరుగులేని రికార్డు సొంతం చేసుకున్నారు.  రాజ‌కీయాల్లో రాణించాలంటే త‌లలు పండిన రాజ‌కీయ ప‌రిజ్ఞానం అవ‌స‌రం లేద‌ని ఆమె ఫ్రూవ్ చేసుకున్నారు. అదే టైంలో మాధ‌విని చిన్న వ‌య‌స్సులోనే ఎంపీని చేయ‌డంలో ఏపీ సీఎం జ‌గ‌న్ క్రెడిట్‌ను కూడా కాద‌న‌లేం.

మరింత సమాచారం తెలుసుకోండి: