కృష్ణా జిల్లాలో దశాబ్దాల కాలం నుంచి రాజకీయ వైరం కొనసాగిస్తున్న కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే అవి...దేవినేని, వసంత కుటుంబాలే. నందిగామలో మొదలైన వీరి యుద్ధం.... ఇప్పుడు మైలవరం చేరింది. తన అన్న దేవినేని వెంకటరమణ మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని ఉమా టీడీపీ నుంచి బరిలోకి దిగి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వసంత వెంకట కృష్ణప్రసాద్‌ని ఓడించారు. ఇక తర్వాత 2004లో కృష్ణప్రసాద్ తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరావుని ఉమా ఓడించారు.

 

ఆ తర్వాత నందిగామ ఎస్సీ రిజర్వడ్‌గా మారడంతో 2009, 14 ఎన్నికల్లో మైలవరం నుంచి ఉమా గెలుపొందారు. ఇక 2019 ఎన్నికలకొచ్చేసరికి ఉమా ప్రత్యర్ధిగా ఉన్న వసంత వెంకట కృష్ణప్రసాద్ మైలవరం వచ్చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసి, ఉమాని చిత్తుగా ఓడించారు. అప్పటివరకు జిల్లాలో పెత్తనం చేస్తున్న ఉమాకు ఒక్కసారిగా చెక్ పెట్టారు. అయితే సార్వత్రిక ఎన్నికలు అయిపోయి 10 నెలలు అయిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి.

 

సార్వత్రికంలో ఓడిపోయిన ఉమా, స్థానికంలో మైలవరంలో మెజారిటీ స్థానాలు గెలుచుకుని వసంతకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే ఉమాని మళ్ళీ ఓడించి, తన సత్తా ఏంటో చూపించాలని వసంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరువురు నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఇలా మాటల యుద్ధం చేసుకుంటూనే మరోవైపు స్థానిక పోరులో గెలుపుపై వ్యూహాలు రచించుకుంటున్నారు.

 

అయితే నియోజకవర్గంలో ఉన్న వాస్తవ పరిస్థితులని చూస్తుంటే, అధికారంలో ఉండటం వసంతకు కలిసొచ్చే అంశం. అలాగే ఆర్ధికంగా కూడా బలంగా ఉండటం మరో అడ్వాంటేజ్. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి జరగాలంటే, స్థానిక పోరులో మెజారిటీ స్థానాలు వైసీపీనే గెలిపించాలి. కాకపోతే పక్కనే ఉన్న రాజధాని అమరావతి ఇష్యూ ఉమాకు కలిసొస్తుంది. ఆయన అమరావతి కోసం, అలాగే నియోజకవర్గంలో సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో 2019 ఎన్నికల సీన్ రివర్స్ అవుతుందో...రిపీట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: