ఉత్తరాంధ్రాలోనే ప్రఖ్యాత నారసింహ క్షేత్రం సింహాద్రి  అప్పన్న స్వామి వారి ఆలయం. అటు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా పొరుగున ఉన్న ఒడిషా వారికి కూడా అప్పన్న కులదైవం. అటువంటి అప్పన్న ఆలయంలో అపచారాలు జరిగిపోయాయా. అప్పన్న ఆలయంలో హిందూ మతాచారాలకు దెబ్బ తగిలిందా. ఇదిపుడు పెద్ద ఎత్తున ఆస్తిక జనుల్లో చర్చ సాగుతోంది.

 

 

దీనికంతటికీ కారణం రెండు రోజుల క్రితం జరిగిన సంచయిత గజపతిరాజు అప్పన్న ఆలయ బోర్డుకు చైర్ పర్సన్ గా ప్రమాణం చేయడం. ఆమె ఎవరో కాదు, పూసపాటి వంశీకురాలే. పైగా మాజీ ఎంపీ, మాజీ మంత్రి అయిన దివంగత ఆనందగజపతిరాజు కుమార్తె. 

 

ఆమెను ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ గా వైసీపీ సర్కార్ ఎంపిక చేసింది. అదే పోస్టులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుని తప్పించారు. దాంతో ఆయన తన ఆవేదనను, అక్కసును వెళ్ళగక్కుతున్నారు. హిందూమతానికి చెందిన పవిత్ర ఆలయంలో వేరే మతానికి చెందిన ఆమెను చైర్ పర్సన్ని ఎలా చేస్తారని నిలదీస్తున్నారు. సంచయిత గజపతిరాజుకు ఏ అర్హత ఉందని పవిత్ర ఆలయంలో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని ఆయన నిగ్గదీస్తున్నారు.

 

అయితే దీనికి సంచయిత గజపతిరాజు కూడా  ధీటుగా సమాధానం ఇచ్చారు. తన సొంత బాబాయి అశోక్ ఇలా తన మీద నిందలు వేస్తారా అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. తాను పక్కా హిందువునని ఆమె చెప్పుకున్నారు. తాను వాటికన్ సిటీకి వెళ్ళినంతమాత్రాన క్రిస్టియన్ని అయిపోతానా అని అమె ప్రశ్నిస్తున్నారు. అశోక్ కూడా తన జీవితంలో ఎపుడూ చర్చిలకు, మసీదులకు వెళ్ళలేదా. ఆయన కూడా మతం మార్చుకున్నారా అని ఆమె నిగ్గదీశారు.

 

తన తాత పీవీజీ రాజు మహిళలను గౌరవించి వారి కోసం ప్రత్యేకంగా మహిళా కళాశాలను కట్టించారని, అయితే తనపైన నిందలు వేస్తూ మహిళలకు పదవులు అక్కరలేదన్నట్లుగా సొంత బాబాయి మాట్లాడడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తానికి రాజుల కోటలో రచ్చ బాగానే జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: