మన దేశంలో అనాదిగా ఏదైనా ఉంది అంటే అది కుల వ్యవస్థ మాత్రమే.. దీని చరిత్ర మూలాల్లోకి వెళ్తే అది చాలా పెద్ద కథ అవుతుంది కానీ.. ఇటీవల ఇలాంటి ఓ వింత వివక్ష సంఘటన కేరళలో కలకలానికి దారి తీసింది. అక్కడి త్రిసూర్ ప్రాంతంలో కుట్టుముక్క మహా దేవ ఆలయం ఉంది. అక్కడ గుడి వెనుక భాగంలో మరుగు దొడ్లు ఉన్నాయి. దేవాలయం అయితే ఏంటి మరుగుదొడ్డి ఉండ కూడదా అంటారా.. ఇక్కడ వివాదం అదికాదండీ బాబు..

 

 

ఎక్కడైనా మరుగు దొడ్ల వద్ద బోర్డులు ఏమని ఉంటాయి.. ఇది స్తీలకు, పురుషులకు.. లేదా షి, హి అనో ఉంటాయి. ఇది అన్ని చోట్లా ఉండేదే కానీ.. ఆ దేవాలయంలో మాత్రం ఇది బ్రాహ్మణులకు మాత్రమే అని టాయి లెట్ పై రాసిన బోర్డు ఉంది.. అక్కడ మొత్తం మూడు టాయిలెట్స్ ఉంటే.. వాటిలో ఒకటి కేవలం బ్రాహ్మణులకు కేటాయించి ఉందన్న మాట. తాజాగా అక్కడకు వెళ్లిన ఓ రీసెర్చ్ స్కాలర్ ఆ గుడికి వెళ్లాడు.. లఘశంక తీర్చుకుందామని టాయిలెట్ల వైపు వెళ్లాడు.

 

 

అక్కడ టాయిలెట్ల విషయంలో ఉన్న కుల వివక్ష చూసి ఔరా అని ముక్కన వేలేసుకున్నాడు. ఈ అరాచకం ఇలా కాదు.. దీన్ని ప్రపంచానికి చాటుదాం అని దాన్ని ఫోటో తీసి.. చూశారా ఈ వింత కుల వివక్ష అంటూ సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక ఏదైనా విషయం సోషల్ మీడియాకు ఎక్కందంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందేగా.. అందులోనూ కులం, మతం అనేసరికి మన నెటిజన్లు చాలా సెన్సిటైజ్ అయిపోతారు. ప్రతి ఒక్కరు తమ భావజాలానికి అనుగుణంగా వాదించడం మొదలు పెడతారు.

 

 

ఇక్కడ అదే జరిగింది. ఆ ఫోటోపై కేరళలో చాలా రచ్చ జరిగింది. అసలే అక్కడ ఉంది కమ్యూనిస్టు ప్రభుత్వం.. ఓ ఎర్ర ప్రభుత్వంలో ఈ బ్రాహ్మణాధిపత్య భావజాలమేంటన్న రచ్చ మొదలైంది. ఈ విషయం ఆలయ నిర్వాహకుల దృష్టికి రాగానే.. అబ్బే మేమూ ఇన్నాళ్లు గమనించలేదు సుమా.. అని ఆ బోర్డు పీకేశారు.. కానీ ఒక్కసారి రాజుకున్న రాజకీయ రచ్చ మాత్రం ఇంకా చల్లారడం లేదు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ వేసేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: