ఈ వారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీ బిజీ గా గడిపారు. అటు రాజకీయ అంశాలతో పాటుగా ఇటు పరిపాలనలో కూడా ఆయన బిజీ గానే ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో పలు సమీక్షా కార్యక్రమాలను నిర్వహించడమే కాదు... పలు కీలక ఆదేశాలు జారీ చేసారు. డబ్బులు పంచి ఎలక్షన్లు చేశారని తేలితే వారిపై అనర్హత వేటు వేయడమే కాదు.. వారిని జైలుకు కూడా పంపిస్తామని సమీక్షా సమావేశాల్లో జగన్ స్పష్టమైన హెచ్చరికలు చేసారు. 

 

మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన, ఆహార పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు జగన్. బుధవారం తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డి.జయకుమార్ లు కలిశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానం గురించి చర్చించారు. గురువారం ఎన్ఫోర్స్ మెంట్, ఎక్సైజ్ శాఖాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులు  నడవకూడదని, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగకూడదని ఆదేశాలిచ్చారు జగన్. 

 

ఆ రోజే వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో రూ.12 వేల కోట్లతో  మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ పెడతామంటూ ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ప్రతిపాదనలు తీసుకురావడంతో ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు జగన్. శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో హౌసింగ్‌ అధికారులతో ఇళ్ల పట్టాలు, నిర్మించాల్సిన ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇళ్లన్నీ నాణ్యంగా, ఒకే నమూనాలో ఉండాలని, కాలనీల్లో చెట్లు నాటడంతో పాటు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించామని అన్నారు. అదే రోజు... కరోనా వైరస్‌ నిరోధానికి సంబంధించి తీసుకుంటున్న ముందస్తు చర్యలపై అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

 

ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దని, జాగ్రత్తలు సూచించమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలను నివారించేందుకు పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ``నిఘా`` యాప్ ను క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎన్నికల్లో మన కళ్ల ముందర జరిగే అక్రమాలకు సంబంధించి ఫోటో, వీడియో, ఆడియోలను ఈ యాప్ ద్వారా రికార్డ్ చేసి ఫిర్యాదు చేయవచ్చని శనివారం ఒక యాప్ ని ఆవిష్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: