యెస్ బ్యాంక్ సంక్షోభంలో కీల‌క ప‌రిణామం జ‌రిగింది. వ్యవస్థాపకుడు రానాకపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టేరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం బ్యాంక్‌ స్కాం, మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ అతడిని అరెస్ట్‌ చేసింది. తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 3 వరకు బ్యాంకుపై ఆంక్షలు ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది. ఈ స‌మ‌యంలో యెస్ బ్యాంక్ ఫౌండ‌ర్ అరెస్టు సంచ‌ల‌నంగా మారింది.

 


దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో నాలుగవదిగా ఉన్న యెస్‌ బ్యాంకు ప్రస్తుతం కొత్త రుణాలిచ్చేందుకు నిధుల్లేక తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయింది. నిధుల సమీకరణ ద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు యెస్‌ బ్యాంకు తాజాగా చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో గురువారం ఆ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడంతోపాటు ఖాతాదారులు నెలలో రూ.50 వేలకు మించి నగదు ఉపసంహరించడానికి వీల్లేదని పరిమితి విధించిన విషయం తెలిసిందే. దీంతో యెస్‌ బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉండ‌గా ,డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారడం అదేవిధంగా మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చినా రుణాల్లో కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారని ఆధారాలు లభించడంతో కపూర్‌పై ఈడీ ఫోక‌స్ పెట్టింది. శుక్రవారం రాత్రి ఈడీ అధికారులు రానాకపూర్‌ నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టి విచారించారు. అనంత‌రం అరెస్టు చేశారు. 

 


మ‌రోవైపు యెస్‌ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం భరోసా ఇచ్చారు. ఈ సంక్షోభాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కృషిచేస్తున్నదని తెలిపారు. ఈ సంక్షోభంపై తాను ఆర్బీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆర్బీఐ తనకు హామీ ఇచ్చిందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: