హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న అర్ధరాత్రి తరువాత మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆర్య వైశ్య భవన్ సిబ్బంది ఈరోజు ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న మారుతీరావును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని సమాచారం. ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు ప్రధాన నిందితునిగా ఉన్నారు. ప్రణయ్ హత్య తర్వాత తనపై బనాయించిన కేసుల వల్లే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రణయ్ హత్యకు మారుతీరావే కారణమని భావించిన పోలీసులు ఏ1గా అతడిని అరెస్ట్ చేశారు. 
 
ఆరు నెలల క్రితం మారుతీరావు బెయిల్ పై విడుదల కాగా... ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. వారం రోజుల క్రితం మారుతీరావుకు సంబంధించిన షెడ్డులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించటంతో కలకలం రేగింది. ఆ మృతదేహానికి సంబంధించిన సమాచారం ఇప్పటివరకూ తెలియలేదు. పోలీసులు మృతదేహం ఎవరిదన్న కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 
2018 సెప్టెంబర్ 14న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. గర్భిణిగా ఉన్న భార్య అమృతతో పాటు ఇంటికి వెళ్తున్న ప్రణయ్ ను కత్తులతో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కిరాయి హంతకులకు కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మారుతీరావు హత్య చేయించాడనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఆ లేఖలో " గిరిజా క్షమించు... అమృత అమ్మ దగ్గరికి రా " అని రాసి ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: