పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విష‌యంలో దేశంలో ఇంకా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వివిధ ప‌క్షాలు త‌మదైన శైలిలో ఆందోళ‌న తెలుపుతున్నాయి. మ‌రోవైపు ప్ర‌భుత్వం సైతం వాటిని దూరం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ స‌న్నిహితుడు, కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్ ఈ విష‌యంలో కీల‌క క్లారిటీ ఇచ్చారు. ఈటీ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ శ‌ర‌ణార్థులు, పౌర‌స‌త్వం గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచంలో ఏ ఒక్క దేశం అందరికీ స్వాగతం పలుకదని ఆయన వ్యాఖ్యానించారు. 

 

 

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసుకొచ్చింది దేశంలో శరణార్థుల సంఖ్యను తగ్గించడానికే అని  విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్ స్ప‌ష్టం చేశారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరిని స్వాగతించే దేశాన్ని చూపండి. కానీ ఏ ఒక్కరు చూపలేరు’ అని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితిపై ఐరాస మానవ హక్కుల మండలి చేసిన విమర్శలపై మండి పడ్డారు.  సీఏఏ భారత సార్వభౌమ అంశమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం స‌రైంది కాద‌ని కేంద్ర‌మంత్రి తేల్చిచెప్పారు. 

 

కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అంశానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల హైకమిషనర్‌ కార్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంపై భారత్‌ బాధ్యతల నేపథ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం సీఏఏను పరిశీలించేందుకు కోర్టుకు సహకరిస్తామని పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో మతపర వివక్షను ఎదుర్కొంటున్న హిందువులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించాలన్న సీఏఏ ఉద్దేశాన్ని స్వాగతించింది. అయితే ఇస్లాం మతానికి చెందిన వారిని మినహాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో 12 పేజీల పిటిషన్‌ను తమ కార్యాలయం దాఖలు చేసినట్లు ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ మిచెల్‌ బాచెలెట్‌ జెనీవాలోని భారత శాశ్వత మిషన్‌కు గ‌త‌ సోమవారం తెలియజేశారు. దీనిపైనే తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: