ఈరోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు 2020 - 2021 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించామని హరీష్‌రావు తెలిపారు. తనకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 
 
దేశవ్యాప్తంగా గతేడాది నుంచి ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని చెప్పారు. కేంద్రం నుండి జీఎస్టీ రావడం లేదని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2019 - 2020 వృద్ధి రేటు 6.5 శాతంగా ఉందని చెప్పారు. గత బడ్జెట్ అంచనాల ప్రకారం 2020 మార్చి నాటికి 1,36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి 1,82,914 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను హరీష్‌రావు ప్రవేశపెట్టారు. 
 
వాస్తవిక దృక్పధంతో బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన నేత కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా కేసీఆర్ దార్శనికతతో ముందుకు వెళుతోందని చెప్పారు. సీఎం సమగ్ర దృష్టి, శ్రద్ధాశక్తుల ప్రతిబింబమే రాష్ట్ర బడ్జెట్ అని అన్నారు. హరీష్ రావు రెవిన్యూ మిగులును ప్రతిపాదిస్తూ... ఆర్థిక లోటును ప్రస్తావించారు. బడ్జెట్ లో ప్రభుత్వ ప్రాధాన్యతలకు పెద్దపీట వేసినట్లు హరీష్‌రావు తెలిపారు. 
 
రైతు రుణమాఫీని ఒకే విడతలో చేయబోతున్నట్లు హరీష్‌రావు ప్రకటించారు. రెవిన్యూ మిగులు 4482 కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. బడ్జెట్ లో రైతుబంధు పథకానికి 12,000 కోట్ల రూపాయలను కేటాయించారు. సాగునీటి రంగానికి 11,054 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. .లక్షా 82 వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌లో లక్షా 38 వేల 668 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయంగా పేర్కొన్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: