అమరావతి  ఉద్యమం ఏపీలో తీవ్రస్థాయిలో అగ్గి రాజేసింది. మూడు రాజధానులు వద్దే వద్దు అమరావతి ముద్దు అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వైసిపి రాజకీయ ప్రత్యర్దులైన కొన్ని పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం ఈ ఉద్యమానికి మరింత ఊపు తీసుకురావడం, స్థానిక ప్రజలను రెచ్చగొట్టడంతో అమరావతిలో రాజధాని మంటలు పెద్ద ఎత్తున అంటుకున్నాయి. ఈ మంటలను ఏపీ మొత్తం విస్తరించాలని తెలుగుదేశం పార్టీ గట్టిగానే ప్రయత్నించింది. చాలా ప్రాంతాల్లో అమరావతి జేఏసీ నాయకులను వెంటేసుకుని మరీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జోలె పట్టుకుని డబ్బులు పోగెయ్యడం దగ్గర నుంచి ఆయన భార్య చేతి గాజులు కూడా అమరావతి ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవరకు ఇలా పెద్ద తతంగమే నడిపించి హీటు పెంచే ప్రయత్నం చేసారు. 


ప్రజా చైతన్య యాత్ర పేరుతో అమరావతి వ్యవహారాన్ని రాష్ట్రమంతా చాటిచెప్పాలని చూసిన చంద్రబాబుకు విశాఖలో అడుగడుగునా నిరసనలు ఎగిసిపడి ఆ యాత్ర విశాఖలో ప్రారంభం కాకుండానే ముగించాల్సి వచ్చింది. అంతేకాకుండా, అమరావతి ప్రాంతం రైతులకు, ప్రజలకు జగన్ ఆ ప్రాంత రైతులకు భరోసా కల్పించే విధంగా హామీలు ఇవ్వడంతో ఆ ప్రాంత జనాల్లో మార్పు కనిపించింది. అదే సమయంలో బిజెపి కూడా మూడు రాజధానులకు మద్దతు పలకడంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన కూడా అమరావతి ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంది. 

IHG


ఈ పోరులో విశాఖలో ఎదురైనా నిరసన వల్ల టిడీపీ కూడా పక్కకు తప్పుకోవడంతో జేఏసీ నాయకులకు కూడా ఉత్సాహం తగ్గిపోయింది. ప్రస్తుతం అమరావతి వ్యవహారం ఏపీలో పూర్తిగా సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. ఇప్పుడంతా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టడంతో ఈ అంశానికి ఎవరూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. క్రమక్రమంగా అమరావతి వ్యవహారాన్ని అందరూ మర్చిపోయేలా కనిపిస్తున్నారు. ఇక టీడీపీ ఏదో మొహమాటానికి ఎప్పుడైనా ఈ వ్యవహారాన్ని కదిపేందుకు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో ఆ పోరాటంలోకి వెళ్లే అవకాశం అయితే కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: