తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీ రావు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మారుతీ రావు కుమార్తె అమృత, పెరుమాళ్ళ ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఈ వ్యవహారం తండ్రి మారుతీరావు కు నచ్చలేదు. ఆ తరువాత అమృత, ప్రణయ్ రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఈ సందర్భంగా పోలీసుల సమక్షంలో తల్లిదండ్రుల వద్దకు వెళ్లానని, అత్తా మామా , భర్తతోనే ఉంటానని చెప్పడంతో అప్పటి నుంచి ఆమె అక్కడే ఉంటుంది. ఈ గొడవలు ఇలా ఉండగా ప్రణయ్ ను మారుతి రావు హత్య చేయించడంతో ఈ వ్యవహారం సంచలనం రేపింది.

 

 ఈ హత్యకు అమ్మాయి తండ్రి మారుతీరావు కారణం అని పోలీసులు అతడిని ఏ1 , ఆయన తమ్ముడు శ్రవణ్ ఏ 2 గా కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే కొద్ది రోజుల క్రితం మిర్యాలగూడ లో మారుతి రావు కు చెందిన షెడ్ లో గుర్తు తెలియని మృతదేహం లభించడంతో మరోసారి సంచలనం అయ్యింది. ఆ మృతదేహం మిర్యాలగూడ పట్టణ శివారులోని అద్దంకి నార్కెట్ పల్లి ప్రధాన రహదారి పక్కన ఉండటం, మృతదేహం పక్కన ఓ గొనె సంచి ఉండడంతో, ఎక్కడో హత్యచేసి ఇక్కడకు తీసుకొచ్చి పడినట్టుగా పోలీసులు అనుమానించారు. అయితే మృతదేహాన్ని గుర్తు పట్టకుండా, ఆయిల్ జల్లడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. ఆయిల్ కారణంగా మృతదేహం వారం రోజుల వరకు ఎటువంటి దుర్వాసన రాకపోవడంతో అప్పటివరకు దీని సంగతి  బయటపడలేదు. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఆ మృతదేహం ఎవరిదో మిస్టరీగానే ఉండగా... 


తాజాగా అమృత తండ్రి మారుతీరావు ఖైరతాబాద్ లోని  ఆర్య వైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆరు నెలల క్రితం జైలు నుంచి మారుతీరావు విడుదలయ్యారు. ఆ తర్వాత కూతురు అమృతను ఇంటికి రమ్మని మారుతీరావు పలుమార్లు కోరడంతో  అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిర్యాలగూడ పోలీసులు మారుతీరావు ను  అరెస్టు చేసి రిమాండ్ కు  తరలించారు. ఇక జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కూతురు కోసం ఆయన బాగా మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. అమృత ప్రణయ్ వ్యవహారంలో విలన్ గా మారిన మారుతీ రావు నేరస్తుడిగా , బాధితుడిగా మారిపోవడం, ఈ వ్యవహారం  విషాదాంతంగా మారింది. ఇందులో తప్పెవరిది అనే విషయం పక్కన పెడితే కుల వివక్ష, బిడ్డలపై ప్రేమ, అదికాస్తా కక్షగా మారడం, ఆ తరువాత నేరానికి దారితీయడం, భావోద్వేగాలు, సామాజిక అంశాలు ఇలా అన్ని కలగలిపి ఒక విషాద గాధ గా ఈ వ్యవహారం మిగిలిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: