2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర‌ వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ వార్షిక బ‌డ్జెట్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ‌రంగానికి ప్ర‌ధానంగా రైతు సంక్షేమం, అభివృద్ధికి పెద్ద‌పీట వేసింది. జాతీయంగా, అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నా, కేంద్రం నుంచి పెద్ద‌గా స‌హ‌కారం అంద‌కున్నా గ‌తంలోలాగే సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం రైతాంగానికి అండ‌గా నిలిచింది. ఈ బ‌డ్జెట్‌లో కేటాయించిన నిధుల‌ను ప‌రిశీలిస్తే ఇదే విష‌యం తెలుస్తుంద‌ని ప‌లువురు నిపుణులు అంటున్నారు.



ఎన్ని ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉన్నా సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా వాస్త‌విక దృక్ప‌థంతో బ‌డ్జెట్‌ను రూపొందించిన‌ట్లు చెప్పిన‌ట్లుగానే కేటాయింపులు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే గతంలో మాదిరిగానే ఈ బడ్జెట్‌లో సంక్షేమ, నీటిపారుదల, వ్యవసాయరంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు. రైతు రుణ‌మాఫీని చెక్కుల రూపంలో అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. ఇక్క‌డ ఆయ‌న రాష్ట్రంలో చేప‌ట్టిన సాగునీటి ప్రాజెక్టుల‌ను కూడా ప్ర‌స్తావించారు.



కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అద్భుతం సృష్టించింద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. పంట‌ల‌కు స‌కాలంలో స‌మృద్ధిగా సాగునీరు అందుతోంద‌ని ఆయ‌న అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో భాగ‌స్వాముల‌న ఇంజినీర్ల సేవ‌ల‌ను ఆయ‌న కొనియాడారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో తుమ్మ‌లు మొలిచిన ఎస్సారెస్పీ కాలువ‌ల్లో నేడు గోదావ‌రి జ‌లాలు ప‌రుగులు తీస్తున్నాయ‌ని, బీడుభూములు ప‌చ్చ‌ని పంట‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.



- రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు

-సాగునీటి రంగానికి రూ. 11,054 కోట్లు

-విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్లు

-పాడి రైతుల ప్రోత్సాహం కోసం రూ. 100 కోట్లు

-రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు

-ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు కేటాయింపు

-బిందు, తుంపర సేద్యానికి రూ. 600 కోట్లు

-రైతుబంధు పథకం కోసం రూ. 14 వేల కోట్లు

-రైతు బీమా కోసం రూ. 1,141 కోట్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: