తెలంగాణ‌ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ 2020-21ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. ఆయ‌న‌ తొలిసారిగా సభలో బడ్జెట్‌ ప్రంసంగాన్ని చదివి వినిపించారు. అయినా ఎక్క‌డ కూడా ప్ర‌సంగంలో త‌డ‌బాటు లేదు.. గంద‌ర‌గోళం అంత‌క‌న్నా క‌నిపించ‌లేదు. చాలా స్ప‌ష్టంగా నెమ్మ‌దిగా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా హ‌రీష్‌రావు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. నిజానికి.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత ఆయ‌న‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆ త‌ర్వాత కొద్దిరోజుల‌కే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉన్నా.. అప్పుడు శాస‌న స‌భ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆరే స్వ‌యంగా బ‌డ్జెట్‌ను చ‌దివారు.



ఆ త‌ర్వాత ఈ వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం మంత్రి హ‌రీశ్‌రావుకు ద‌క్కింది. అయితే.. ఆయ‌న బ‌డ్జెట్ ప్ర‌సంగం కోసం గులాబీ శ్రేణులే గాకుండా.. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశారు. మంత్రి హ‌రీశ్‌రావు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ప్ర‌శాంతంగా ప్రారంభించారు. బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌, ప్రాధాన్య అంశాలు.. జాతీయంగా, అంత‌ర్జాతీయంగా ఉన్న అనుకూల ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూనే త‌న ప్ర‌సంగాన్ని కొనసాగించారు. శాఖ‌ల వారీగా, రంగాల వారీగా కేటాయింపుల‌ను వివ‌రిస్తూనే బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌లో తీసుకున్న ప్రాధాన్య అంశాల‌ను వివ‌రించే ప్రయ‌త్నం చేశారు. అయితే, హ‌రీశ్‌రావుకు ఏ బాధ్య‌త‌లు అప్ప‌గించినా స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తార‌ని, వెన‌క‌డుగు వేసే అవ‌కాశ‌మే ఉండ‌ద‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు.



టీఆర్ఎస్ పార్టీలో ఆయ‌న‌కు ట్ర‌బుల్ షూట‌ర్‌గా గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్య‌మం ప్రారంభం నుంచీ ఉన్న హ‌రీశ్‌రావు ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నారు. తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను కూడా అనుకూలంగా మ‌ల‌చి టీఆర్ఎస్‌కు అనూహ్య విజ‌యాలు అందించారు. అయితే, చాలాకాలం పాటు నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయిన హ‌రీశ్‌రావు శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డంతో ఆయ‌న అభిమానులు, అనుచ‌రులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ‌లో కీల‌క‌మైన శాఖ‌కు మంత్రిగా ఉన్న హ‌రీశ్ రావు రెండోసారి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక రాజ‌కీయంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడు ఆయ‌న‌కు ల‌భిస్తోన్న ప్ర‌ధాన్యంపై కూడా తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: