భారత్ లో కరోనా కేసుల సంఖ్య 34కు చేరింది. లడఖ్ లో ఇద్దరికి, తమిళనాడులో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. జమ్మూలో కూడా కరోనా లక్షణాలతో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా నియంత్రణపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

 

దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 34కు చేరింది. ఇరాన్ వెళ్లొచ్చిన ఇద్దరు లడఖ్ వాసులకు కరోనా పాజిటివ్ గా తేలింది. తమిళనాడులో కూడా ఓ వ్యక్తికి కరోనా వచ్చింది. జమ్ములో కూడా ఇద్దరు కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారని అక్కడి అధికారులు ప్రకటించారు. వీరిలో ఒకరు గతంలో ఇటలీకి, మరొకరు దక్షిణ కొరియాకు వెళ్లొచ్చినట్లు సమాచారం. తొలుత వీరు ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డు నుంచి పారిపోయారని.. ఎట్టకేలకు తిరిగి పట్టుకున్నామని అధికారులు చెప్పారు. జమ్ము, సాంబా జిల్లాల్లో అన్ని ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు విధానం నుంచి మినహాయింపు కల్పించారు.

 

కరోనా వైరస్‌ భయంతో.. కర్ణాటక ప్రభుత్వం సైతం బయో మెట్రిక్‌ హాజరుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు బయో మెట్రిక్‌ హాజరు నుంచి మినహాయింపు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే అధికారులు దీనిపై కార్పొరేట్‌, ఐటీ కంపెనీలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.  

 

కరోనా వ్యాప్తికి సంబంధించి అనేక వదంతులు చక్కర్లు కొడుతున్నాయని.. వాటిని నమ్మొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఎప్పటికప్పుడు వైద్యులు సలహాలు పాటించాలని సూచించారు. ఇతరుల్ని పలకరించేందుకు హ్యాండ్‌ షేక్  విధానాన్ని దూరం పెట్టి భారత సంప్రదాయ పద్ధతిలో నమస్తే చెప్పడం మేలని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ ఆచారానికి స్వస్తి పలికి ఉంటే తిరిగి ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు.  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, శాఖ కార్యదర్శులతో సమావేశమై కరోనా వ్యాప్తి, సన్నద్ధతపై సమీక్షించారు మోడీ. 

 

కరోనా వైరస్‌ తరుణంలో.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు విమానాల క్యాన్సిలేషన్‌, రీషెడ్యూలింగ్‌ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 12 నుంచి మార్చి 31 మధ్య జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు టికెట్‌ బుక్‌ చేసుకున్న రద్దు చేసుకున్నా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని పేర్కొంది. 
ప్రఖ్యాత టెలికాం సంస్థలు జియో, బిఎస్‌ఎన్‌ఎల్  తమ కాలర్ ట్యూన్లు మార్చేసాయి. దేశంలో కరోనావైరస్ ప్రబలుతున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం సూచనమేరకు ఈ వైరస్ పట్ల అవగాహన కల్పిస్తూ ఈ కాలర్‌ట్యూన్లను రూపొందించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: