ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు.. తానంటే ఏమిటో.. త‌న ప్ర‌జాప‌లుకుబ‌డి ఏమిటో మ‌రోసారి నిరూపించుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల వ‌ద్ద ద‌టీజ్‌.. ఎర్ర‌బెల్లి! అని అనిపించుకున్నారు. ఇప్పుడు ఇదే విష‌యాన్ని అనుచ‌రులు ఆనందంగా చెప్పుకుంటున్నారు. ఇంత‌కీ రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఏం చేశార‌ని, ఏం సాధించార‌ని అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే మ‌రి. త‌న రాజ‌కీయ జీవితంలో ఓట‌మెరుగ‌ని నేత‌గా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు కొన‌సాగుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఎంపీగా పోటీ చేసినా గెల‌వ‌డం ఆయ‌న‌కు అల‌వాటైపోయింది. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేందుకు ఇష్ట‌ప‌డే నేత‌ల్లో ఎర్ర‌బెల్లి ముందు వ‌రుస‌లో ఉంటారు.



ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ హోరుగాలిని త‌ట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేగా ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచారు. ఆ త‌ర్వాత అనేక ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న అధికార టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆ త‌ర్వాత ముంద‌స్తు ఎన్నిక‌ల్లో పాల‌కుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు ఏకంగా మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కింది. టీఆర్ఎస్‌లో మొద‌టి నుంచి ఉన్న నేత‌ల‌ను కాద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎర్ర‌బెల్లికి మంత్రిప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఇప్పుడు ఆ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ముందుకు వెళ్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు అద్భుత‌మైన ఫ‌లితాల‌ను తెచ్చిపెట్టారు.  



స్థానిక సంస్థ‌లు, మున్సిప‌ల్, స‌హ‌కార సంఘాల ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఏక‌ప‌క్ష విజ‌యాలు అందుకోవ‌డంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు కీల‌క పాత్ర పోషించారు. ఉమ్మ‌డి జిల్లాలోని ఎమ్మెల్యేల‌ను, నేత‌ల‌ను, నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఎంపీపీలు, జెడ్పీపీఠాలు, స‌హ‌కార చైర్మ‌న్లు, డీసీసీబీ చైర్మ‌న్‌, ఓడీసీఎంస్ చైర్మ‌న్‌.. ఇలా అన్ని స్థానాల్లో గులాబీ జెండాను ఎగురువేశారు. ఎక్క‌డ కూడా ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ద‌క్క‌కుండా మంత్రి ఎర్ర‌బెల్లి వ్యూహ‌ర‌చ‌న చేశారు. తెలంగాణ‌లోని ఉమ్మ‌డి జిల్లాల్లోనే వ‌రంగ‌ల్‌ను ముందు వ‌రుస‌లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు నిలిపార‌ని ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచేస్తూ అద్భుత‌మైన ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌డంలో రాష్ట్రంలోనే మంత్రి ఎర్ర‌బెల్లి టాప్‌లో కొన‌సాగుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.



ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు ఎర్ర‌బెల్లిని మెచ్చుకున్నార‌ని ప‌లువురు నాయ‌కులు చ‌ర్చించుకున్నారు. అయితే.. అన్నిస్థాయిల నాయ‌కుల‌ను క‌లుపుకుపోవ‌డంలోనే మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు విజ‌య ర‌హ‌స్యం దాగి వుంద‌ని ఆయ‌న అనుచ‌రులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. త‌న రాజ‌కీయ జీవితంలో మొట్ట‌మొద‌టి సారిగా మంత్రిగా సీఎం కేసీఆర్ అవ‌కాశం ఇచ్చార‌ని, ఆయ‌న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా పార్టీని ముందుకు తీసుకుపోవ‌డ‌మే త‌న ధ్యేయ‌మ‌ని అనుచ‌రుల‌తో ఎర్ర‌బెల్లి చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: