చంద్రబాబుకు అర్ధం కానిది ఉంటుందా. ఆయన రాజకీయ ధురంధరుడు. ఆయనది ఫార్టీ  యియర్స్ ఇండస్ట్రీ. ఆయన తలచుకుంటే ఆకాశాన్ని భూమిని కలిపేయగలరు. ఆయనకు సాటీ పోటీ కూడా ఎవరూ లేరు. అటువంటి రాజకీయ చాణక్యం ఎందుకో ఇపుడు బాగా పదును తగ్గింది. గత రెండేళ్ళుగా బాబు చక్రం ఎక్కడా  తిరగడంలేదు.

 

మాజీ సీఎంగా ఉన్నా  ఫరవాలేదు కానీ జగన్ అలా నింపాదిగా ఉండనిచ్చేలా కనిపించడంలేదుగా. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది కానీ టీడీపీ నవనాడులూ క్రుంగిపోయేలా చేస్తున్నాడు. ఉరమని పిడిగులా నెత్తిన లోకల్ ఫైట్ తెచ్చేశాడు.

 

కాదంటే పరువు తక్కువ. బరిలో దిగినా అసలుకే ఎసరుగా సీన్ ఉంది. దాంతో లోకల్ బాడీ ఎన్నికలు ఇపుడు టీడీపీకి తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే మరో వైపు జనసేన, బీజేపీ కాంబో వల్ల ముప్పు పొంచి ఉందని తమ్ముళ్ళు భావిస్తున్నారు. ఆ రెండు పార్టీలు గెలవడం మాట దేముడెరుగు పెట్టాల్సిన చిల్లు టీడీపీకే పెడతాయని అంటున్నారు.

 

ఇలా ఓట్ల చీలిక వల్ల టీడీపీ గెలుపు అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన మొదలైంది. ఇది మరింతగా పసుపు శిబిరాన్ని కలవరపెడుతోంది. 2014 ఎన్నికల్లో మాదిరిగా మూడు పార్టీలు కలిస్తే బాగానే ఉంటుంది కానీ అలా కాకుండా ఆ రెండు పార్టీలు కలసి ఒంటరిగా టీడీపీ పోటీ చేస్తే మాత్రం ఘోర పరాభవం వెతికి మరీ నెత్తిన పెట్టుకున్నట్లవుతుందని టీడీపీ శిబిరం మేధావులు విశ్లేషిస్తున్నారు.

 

మరి వైసీపీ, టీడీపీలకు సమాన దూరం అని బీజేపీ ఒకటికి పదిసార్లు గట్టిగా చెప్పేస్తోంది. పవన్ అయితే పాత మిత్రుడే ఆయన మటుకు బాబుని చూసి  మెత్తబడినా బీజేపీ ఊరుకోదుగా. ఇలా మొత్తం కలసి మళ్ళీ జగన్ని గెలిపించేలా సీన్ ఉందని పసుపు వ్యూహకర్తలు అంటున్నారు. 

 

నిన్నటి మిత్రులే ఇపుడు శత్రువులుగా మారడంతో టీడీపీకి ఏం పాలుపోవడంలేదుట. ఇలా అన్ని వైపులా ప్రతికూలతలతో టీడీపీ క్యాంప్ డీలాపడుతోందని అంటున్నారు. ఓ విధంగా గెలుపు ఆశలు లేక చేతులెత్తేస్తోందని అంటున్నారు. ఇక మిగిలింది సైలెంట్ పొత్తులు. అవి ఈ పీక్ టైమ్ లో కుదురుతాయా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: