కర్నూలు జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయ్. ఉద్యోగులు చేయాల్సిన పనులను ఏకంగా విద్యార్థినులతోనే చేయిస్తున్నారు. పరీక్షల సమయంలో వంట పనులతో సతమతమవుతున్నారు. ఫలితంగా చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన విద్యార్థినుల ఏకాగ్రత పక్కదారి పడుతోంది. వసతి గృహ నిర్వాహకుల తీరుపై విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బాలికల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అయితే కొంతమంది ఉద్యోగులు చేస్తున్న పనులు మాత్రం సర్కారు లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా ఉంటున్నాయి. విద్యా బుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థినులతో వసతి గృహాల్లో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు ఉద్యోగులు. పరీక్షల సమయంలో ఇలా పనులు చేయించటంతో విద్యార్థినులకు చదువుకోవటం కష్టంగా మారింది. 

 

కర్నూల్ జిల్లాలోని అవుకు...కోవెలకుంట్ల ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థినుల చేత అడ్డమైన చాకిరీ చేయిస్తున్నారు. ఈ హాస్టల్స్‌లో వంట పని నుంచి...పాకీ పనుల దాకా విద్యార్థినులే చేస్తున్నారు. ఒక్కో చోట ఒక్కో విధంగా వసతి గృహ నిర్వాహకులు విద్యార్థినులను పనుల పేరిట వేధిస్తున్నారు. కోవెలకుంట్లలోని బాలికల గురుకుల కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగులు వంట పనులు చేస్తుంటారు. అయితే వారికి ఏడాది నుంచి జీతాలు చెల్లించలేదు. ఫలితంగా వారం రోజుల నుంచి వంట మనుషులు విధులకు గైర్హాజరవుతున్నారు. ఐతే...ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రిన్సిపాల్ ఫిర్దోస్ అంజుమాన్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినులకు పరీక్షల జరుగుతున్నాయని తెలిసి కూడా వారితోనే వంట పనులు చేయిస్తున్నారు. ప్రిన్సిపల్‌ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక...అవుకు కస్తూర్బా రెసిడెన్సియల్ పాఠశాలలో విద్యార్థినుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పాకీ పనులు కూడా విద్యార్థినులతోనే చేయిస్తున్నారు. పాఠశాల వసతి గృహానికి నీటిని సరాఫరా చేసే భూగర్భ ట్యాంకు అపరిశుభ్రంగా ఉంది. ట్యాంకులో పాచి పేరుకుపోయింది. విద్యార్థినులను అందులోకి దింపి ట్యాంక్ శుభ్రం చేయించారు హాస్టల్ నిర్వాహకులు. అత్యంత ప్రమాదకర స్థితిలో విద్యార్థినులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. విద్యార్థినులతో పనులు చేయించడమే కాకుండా వాటిని సమర్ధించుకుంటున్నారు సంక్షేమ వసతి గృహ నిర్వాహకులు. ఇక...ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థినుల తల్లిదండ్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: