తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
 తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి దశదిశ చూపే బడ్జెట్ కాదని, ఇది ఒక రొటీన్ బడ్జెట్ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. వాస్తవాలకు ఆమడ దూరంలో ఉన్న బడ్జెట్ అని మండిప‌డ్డారు. ఉపాధి కల్పన, వ్యవసాయ, పారిశ్రామిక వృద్ధికి కానీ కావలసిన ప్రణాళిక ఈ బడ్జెట్‌లో లేదని సంజ‌య్ విశ్లేషించారు.

 

``నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి ఈ బడ్జెట్ ఎటువంటి పరిష్కారం చూపలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ‌తంలో హామీ ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను తుంగలో తొక్కి  నిరుద్యోగ యువత ఆశలపై ఈ బ‌డ్జెట్‌లో నీళ్లు చల్లారు. 2019-20లో 1.36 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం అని బడ్జెట్లో పేర్కొన్నారు. ఏడాది వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసినా అంచనా వ్యయం 1.56 లక్షల కోట్లు దాటదు. మరి అలాంటప్పుడు 1.82 లక్షల కోట్ల బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారు?`` అని నిల‌దీశారు. ఇలా గ‌ణాంకాలు స్ప‌ష్టంగా ఉన్నాయి కాబ‌ట్టే ఇది వాస్తవాలకు దూరంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అని సంజ‌య్ పేర్కొన్నారు. 


  
రాష్ట్రంలో పేరుకుపోయిన 30,000 కోట్ల పైచీలుకు బకాయిల గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావనే లేదని సంజ‌య్ అన్నారు. ``బకాయిలు, సబ్సిడీలు, ఉద్యోగుల జీతాలు, కార్యాలయాల నిర్వహణ వంటి వాటికి కూడా ఈ బడ్జెట్ సరిపోదు. మరి ఈ బడ్జెట్ బంగారు తెలంగాణకు ఎలా బాటలు వేస్తుంది? విద్యకు అరకొరగా కేవలం 6.5 శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశారు. దీనివలన ఇప్పటికే నిర్వీర్యం అవుతున్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది. `` అని సంజయ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

 

``రుణమాఫీ, రైతు బంధు తప్ప వ్యవసాయ అభివృద్ధికి ఈ బడ్జెట్లో పెద్దగా ఏమీ లేదు. నాలుగు విడతలుగా అమలుచేసే రుణమాఫీ వలన రైతుల రుణమాఫీ తీవ్రగా దెబ్బతింటుంది. రెండేళ్లుగా పీఆర్‌సీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తులను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచింది. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి గల ఒక మంచి అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చేజార్చుకుంది.`` అని పెద‌వి విరిచారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: