కారణాలు ఏమి చెప్పినా కానీండి జగన్మోహన్ రెడ్డికి మాత్రం మైనస్ అనే చెప్పాలి. దేనిగురించి అంటారా ?  రాజధాని గ్రామాలను  పంచాయితి ఎన్నికల నిర్వహణ నుండి మినహాయించింది ప్రభుత్వం. అలాగే గుంటూరు జిల్లాలోని మంగళగిరి, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, తాడేపల్లి మున్సిపాలిటిలను కూడా ఎన్నికల నుండి మినహాయించాలని రాష్ట్రప్రభుత్వం ఎన్నికల కమీషన్ ను కోరింది. కోర్టు కేసులు, పంచాయితీల విలీనం, పాలనా సమస్యలే ప్రధాన కారణంగా ప్రభుత్వం చెబుతోంది.

 

నిజానికి పై ప్రాంతాలను పంచాయితీ ఎన్నికల నుండి మినహాయించే విషయంలో ప్రభుత్వం చెప్పిన కారణాలు నిజమే అయినా ఎవరూ నమ్మరు. ఎందుకంటే మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత రాజధాని గ్రామాల్లో మొదలైన ఆందోళనే ప్రధాన కారణంగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లోని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో కొన్ని రోజులు ఆందోళన జరుగుతున్న గ్రామాల్లో ఉద్రిక్తత కూడా చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

 

మొత్తం మీద పై గ్రామాల్లోని జనాలు ప్రభుత్వంపై మండిపోతున్నారన్నది వాస్తవం. ఈ పరిస్ధితుల్లో పంచాయితి ఎన్నికలు జరిగితే జనాలు ఏ విధంగా స్పందిస్తారు ? ఏ విధంగా అంటే కచ్చితంగా అధికారపార్టీకి వ్యతిరేకంగానే వ్యవహరిస్తారని అందరూ అనుకుంటున్నదే. నిజంగానే 29 పంచాయితీల్లో వైసిపి తరపున పోటి చేసిన వారు ఓడిపోతే తమకు ఇబ్బందే అని అధికారపార్టీ అనుకున్నదా ? కాబట్టే ఎన్నికలను వాయిదా వేయించింది అనే ప్రచారం పెరిగిపోతోంది. అదే పద్దతిలో పై మున్సిపాలిటిల్లో కూడా ఎన్నికలను వాయిదా వేయించిందట.

 

నిజానికి రాష్ట్రం మొత్తం మీదున్న సుమారు 14 వేల పంచాయితీల్లో రాజధాని ప్రాంతంలోని 29 పంచాయితీల్లో ఓడిపోయినా వచ్చే నష్టంలేదు. కానీ అధికారపార్టీ అలా అనుకోవటం లేదు. అందుకనే ఏకంగా ఎన్నికలనే వాయిదా వేసేసింది. ప్రభుత్వం చెప్పిన కారణాలే నిజమనుకుంటే ఎన్నికల నిర్వహణపై పంచాయితీలను, మున్సిపాలిటీలను మినహాయిస్తున్నట్లు ముందుగానే ప్రకటించుండాలి. అలా కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించటమంటే జగన్ కు మైనస్ అనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: