పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉన్న కోటగిరి వర్సెస్ ఘంటా పోరులో ఘంటా విల‌విల్లాడుతున్నారు. దివంగ‌త మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావుకు మాజీ ఎమ్మెల్యే ఘంటా ముర‌ళీకి సుదీర్ఘ‌మైన రాజ‌కీయ వైరం ఉంది. కోట‌గిరి వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన ఏలూరు ఎంపీతోనూ ముర‌ళీకి పొస‌గ‌ని ప‌రిస్థితి. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వీరిద్ద‌రు వైసీపీలోనే ఉన్నా ఒక‌రంటే మ‌రొక‌రికి ప‌డ‌లేదు. చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు ముందు ముర‌ళీ టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. గ‌తంలో చింత‌ల‌పూడి ఎమ్మెల్యేగా ప‌నిచేసిన ముర‌ళీ ఆ త‌ర్వాత చింత‌ల‌పూడి, పోల‌వ‌రం రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా ఇన్‌చార్జ్‌గా ప‌నిచేశారు.



అయితే ఇప్పుడు త‌న చిర‌కాల రాజ‌కీయ శ‌త్రువు అయిన ఎంపీ శ్రీథ‌ర్ దెబ్బ‌కు విల‌విల్లాడుతున్నారు. ఒక‌ప్పుడు రాష్ట్ర స్థాయిలో హైలెట్ అయిన ముర‌ళీ నేడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కాదు క‌నీసం మండ‌లం కాదు క‌దా సొంత గ్రామంలోనూ ప‌ట్టుకోసం పాకులాడుతున్నారు. ముర‌ళీ సోద‌రుల‌ను రాజ‌కీయంగా భూస్థాపితం చేసేందుకు ఎంపీ శ్రీథ‌ర్‌, నియోజ‌క‌వ‌ర్గ కీల‌క నేత అయిన మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌రపు అశోక్‌బాబు వేస్తోన్న ఎత్తుల‌తో మురళీ రాజ‌కీయంగా ప‌ట్టు కోసం విల‌విల్లాడుతున్నారు. చివ‌ర‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సొంత మండలంలో వైసీపీకి పోటీ ఇచ్చేందుకు టీడీపీ త‌ర‌పున బ‌ల‌మైన జ‌డ్పీటీసీ, ఎంపీటీసీలే కాదు క‌నీసం ముర‌ళీ స్వ‌గ్రామం అయిన పాతూరులో ఓ వార్డు మెంబ‌ర్ల‌కు కూడా బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను పోటీ పెట్ట‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.



గ‌తంలో ముర‌ళీ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు రాజ‌కీయంగా స్వ‌గ్రామంలోనే ఎన్నో అణిచివేత‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే ముర‌ళీ అనుచ‌రుల్లో కొంద‌రు 2009 ఎన్నికల్లో టీడీపీలోకి వ‌చ్చి అక్క‌డ ప‌ద‌వులు అనుభ‌వించి చ‌క్రం తిప్పారు. దీంతో ముర‌ళీ సొంత పంచాయ‌తీతో పాటు కామ‌వ‌ర‌పుకోట మండ‌ల రాజ‌కీయం మొత్తం ముర‌ళీ స్వ‌గ్రామం అయిన పాతూరు నుంచే జ‌రిగేది. పార్టీలు మారినా... గెలుపు ఎవ‌రిది అయినా ముర‌ళీ & గ్యాంగ్‌దే పెత్త‌నం కావ‌డం కూడా చాలా మందికి విసుగు తెప్పించేసింది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ముర‌ళీ పాత అనుచ‌రులు అంతా ఏక‌మై టీడీపీ గూటికి చేరిపోయారు.



2014 ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ అధికారంలోకి వ‌చ్చినా మండ‌ల స్థాయిలో పాత టీడీపీ నాయ‌కుల‌కు ఒరిగింది శూన్యం. ఈ ప‌ద‌వులు అన్నీ పాతూరుకే చెందిన ముర‌ళీ ఒక‌ప్ప‌టి... ఇప్ప‌టి అనుచ‌రుల‌కే ద‌క్కాయి. వాళ్ల‌లో వాళ్లు క‌ల‌హించుకోవడం.. పార్టీలు మార‌డం.. ఇప్పుడు మ‌ళ్లీ క‌లిసిపోవ‌డం సామాన్య జ‌నాల‌కు, నిజ‌మైన టీడీపీ కేడ‌ర్‌కు ఎంత మాత్రం రుచించ‌లేదు. వీళ్లంతా క‌లిసి పోయినా  గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముర‌ళీ స్వ‌గ్రామం పాతూరులోనే వైసీపీకి మంచి మెజార్టీ వ‌చ్చింది. ఇక ఇప్పుడు వాళ్లు టీడీపీలో ఉన్నా మ‌ళ్లీ ఎవ్వ‌రిని ఎద‌గ‌నిచ్చే ప‌రిస్థితి లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. చివ‌ర‌కు టీడీపీ మండ‌ల అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలోనూ ముర‌ళీ ఆయ‌న పాత అనుచ‌రులు ఒక్క‌టై తాము చెప్పిన వాళ్ల‌కే ఈ ప‌ద‌వి ఇవ్వాల‌ని పెత్తందారి పోక‌డ‌ల‌కు పోతున్నారు.



ఇక పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు అధికారం అనుభ‌వించిన వీళ్లంతా పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పోటీ అంటే మాకెందుకు ఈ రూపాయి ఖ‌ర్చు దండ‌గ అని ఎవ్వ‌రూ డ‌బ్బులు తీసేందుకు కూడా ముందుకు రావ‌డం లేదు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎవ్వ‌రూ పార్టీని బ‌తికించేందుకు ముందుకు రాని ప‌రిస్థితి. దీంతో విసుగు చెందిన టీడీపీ వీరాభిమానులు, ముర‌ళీ & గ్యాంగ్ వ్య‌తిరేక వ‌ర్గం అంతా ఇప్పుడు వైసీపీ బాట ప‌ట్టేస్తున్నారు. వీరంతా అశోక్ డైరెక్ష‌న్‌లో ఎంపీ శ్రీథ‌ర్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరుతున్నారు. ఏదేమైనా రేప‌టి స్థానిక ఎన్నిక‌ల్లో ఘంటా ముర‌ళీ ఒక్క ఎంపీటీసీ కాదు క‌దా.. చివ‌ర‌కు త‌న ఊళ్లో ఓ వార్డు గెలిపించుకుంటే చాలు గ్రేట్ అన్న ప‌రిస్థితికి వ‌చ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: