పేనుకు పెత్తనమిస్తే, ఇల్లంతా గొరిగింది అన్నట్టుగా ఇప్పుడు జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ వ్యవహారాన్ని గురించి ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఏపీలో స్థానిక సంస్థల హడావుడి మొదలవడంతో, ఆకస్మాత్తుగా సినిమాలను వదిలేసి, రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే పరిస్థితి లేదు. అందుకే ఈ వ్యవహారాలను తన తర్వాతి స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ కు  అప్పగించారు పవన్. నాదెండ్ల మనోహర్ ప్రాధాన్యత జనసేన పార్టీలో ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కు ఇచ్చినంత ప్రాధాన్యత మరే ఇతర నేతలకు ఇవ్వరనే చెప్పాలి. పార్టీ పెట్టిన మొదటి నుంచి తన వెన్నంటి ఉన్న వారిని సైతం పక్కనపెట్టి ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ కు ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు పవన్. 


ఇక అప్పటి నుంచి పవన్ ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా, ఎక్కడకు వెళ్లినా ఖచ్చితంగా మనోహర్ పక్కన ఉండాల్సిందే. ఈ ఇద్దరి మధ్య అనుబంధం అంతగా ఏర్పడింది. ఇదే అవకాశంగా తీసుకున్న మనోహర్ పార్టీలో ఇతర నాయకులపై పెత్తనం చేయడం మొదలుపెట్టడంతో, జనసేనలో నాదెండ్ల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ విషయాలు పవన్ వరకు వెళ్లినా, ఆయన మనోహర్ వ్యవహారంలో  ఏ విషయాలను పట్టించుకునేలా కనిపించడం లేదు. నాదెండ్ల మనోహర్ వ్యవహారశైలి కారణంగానే జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. 


ఇప్పుడు జనసేన తరుపున పవన్ అందుబాటులో లేకపోవడంతో నాదెండ్ల మనోహర్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సభలో మాట్లాడుతూ అనేక సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఎక్కడా పవన్ పేరు ప్రస్తావించకుండా తానే ఆ ఆదేశాలను ఇస్తున్నట్లుగా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. పవన్ నాదెండ్ల మనోహర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తప్పు చేస్తున్నాడేమో అన్న భావన ప్రస్తుతం పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: