ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ వ‌ల‌స బెడ‌ద ఎదుర్కొంది. స్థానిక సంస్థ‌ల ఎన్నికల‌కు నోటిఫికేష‌న్ అలా వ‌చ్చిందో లేదో టీడీపీలో వెంట‌నే రెండు బిగ్ వికెట్లు డౌన్ అయ్యాయి. ఒక‌రు కాదు ఏకంగా టీడీపీకి చెందిన ఇద్ద‌రు మాజీ మంత్రులు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరేందుకు ముహూర్తం రెడీ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి రేపో, మాపో అధికార వైసీపీలోకి వెళ్లి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడు మ‌రో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు సైతం టీడీపీకి రాజీనామా చేశారు. డొక్కా సైతం త్వ‌ర‌లోనే వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.



ఇక కాంగ్రెస్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డొక్కా దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం తొలి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. డొక్కా వైసీపీలో చేరి తాడికొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల‌ని అనుకున్నారు. అయితే ఆయ‌న రాజ‌కీయ గురువు అయిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు చ‌క్రం తిప్పి డొక్కాను టీడీపీలోకి తీసుకు వెళ్ల‌డంతో పాటు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇప్పించారు.



ఇక డొక్కా 2019 ఎన్నిక‌ల్లో తాడికొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల‌ని అనుకుంటే చంద్ర‌బాబు ఆయ‌న‌కు ప్ర‌త్తిపాడు సీటు ఇచ్చారు. ప్ర‌త్తిపాడులో డొక్కా ప్ర‌స్తుత హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత చేతిలో ఓడిపోయారు. ఇక కొద్ది రోజుల క్రిత‌మే త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన డొక్కా ఇప్పుడు టీడీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేశారు. ద‌ళితులు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించేందుకు అమ‌రావ‌తి ప‌రిధిలో భారీ ఎత్తున భూములు సేక‌రిస్తున్నారు. వీటిని కొంద‌రు టీడీపీ నేత‌లు త‌ప్పుప‌ట్ట‌డాన్ని జీర్ణించుకోలేని డొక్కా టీడీపీకి కూడా గుడ్ బై చెప్పేశారు.ఇక ఇప్ప‌టికే ఇద్ద‌రు మాజీ మంత్రులు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ లిస్టులో మ‌రి కొంత మంది కీల‌క నేత‌లు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: