ఏపీలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. మొదట ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సిలతో ఎన్నికలు మొదలు కావడంతో గ్రామాల్లో పార్టీల హడావిడి మొదలైంది. ఇక ఈ ఎన్నికలు మార్చి 21న జరగనుండగా, 24న ఫలితాలు వెలువడనున్నాయి.  అయితే ఈ ఎన్నికలు తర్వాత మార్చి23న మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో కొత్త మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగనున్నాయి.

 

ఈ క్రమంలోనే కొత్త ఏర్పడిన మచిలీపట్నం(బందరు) కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటివరకు మున్సిపాలిటీగా ఉన్న బందరు...ఇప్పుడు కార్పొరేషన్ అయింది. మొత్తం 50 డివిజన్లలతో కార్పొరేషన్ ఉంది. ఇక ఈ బందరు కార్పొరేషన్‌ని దక్కించుకునేందుకు అధికార వైసీపీ నుంచి మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), ప్రతిపక్ష టీడీపీ నుంచి మాజీ కొల్లు రవీంద్రలు పోటీపడుతున్నారు.

 

ఇప్పటికే ఇరు పార్టీలు కూడా ప్రచారం మొదలుపెట్టేశాయి. అయితే కొత్తగా ఏర్పడిన బందరు కార్పొరేషన్‌లో వైసీపీ సులువుగా విజయం సాధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండటంతో అభివృద్ధి జరగడం కోసం, బందరు ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపనున్నారు. అటు మంత్రి పేర్ని నాని కూడా ఈ 9 నెలల్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రోడ్లు, డ్రైనేజ్‌ల నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అటు త్రాగునీటి సమస్య లేకుండా చూసుకుంటున్నారు.

 

ఇక బందరు ప్రజల చిరకాల కోరిక అయిన పోర్టు నిర్మాణంలో కూడా నాని దూకుడు చూపిస్తున్నారు. పైగా ఆయనకు ఎలాగో బందరుపై గట్టి పట్టుంది. దీంతో తొలిసారి బందరు కార్పొరేషన్‌పై వైసీపీ జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే బందరులో టీడీపీ కూడా మంచి బలంతోనే ఉంది. కార్పొరేషన్‌లోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. అయితే టీడీపీ వైసీపీకి గట్టి పోటీ ఇస్తుంది గానీ, గెలుపు తీరాలకు మాత్రం చేరలేదని తెలుస్తోంది. మొత్తానికైతే బందరులో వైసీపీకే గెలవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: