ఏపీలో ఇప్పుడు ఎన్నికల సందడి మొదలవుతుంది. చాలా రోజుల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రక్రియను గమనిస్తే చాలా వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. పంచాయితీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు , జడ్పీ ఎన్నికలు.. ఇలా మూడు రకాలు ఎన్నికలు అన్నీ కూడా కేవలం 20 రోజుల్లో నిర్వహించబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం దగ్గర నుంచి నామినేషన్లు వేయడం, వాటిని ఉపసంహరించుకోవడం, ఎన్నికల ప్రచారం.. పోలింగ్, ఫలితాలు అన్నీ ఈ 20 రోజుల్లోనే జరిగిపోవాలి.

 

ఇది ఒక రకంగా రికార్డే.. అసలు ఇంత స్పీడ్ గా చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది.. ఈ అంశాన్నే చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి మరీ నిలదీశారు. ఓ వైపు కరోనా భయంతో జనం చస్తుంటే..ఇప్పుడు ఎన్నికలేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే మరి జగన్ ఎందుకు హడావిడిగా ఎన్నికలు పెడుతున్నాడో ఓ వైసీపీ నేత చెప్పారు. అందులోనూ ఆయన జగన్ కు చాలా క్లోజ్ అని చెబుతారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

 

 

ఆయన ఏమంటున్నారంటే.. “ ఈ నెలలో ఎన్నికలు జరగకపోతే మున్సిపాలిటీలు, పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.5 వేల కోట్లు రావు.. కాబట్టి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. గత నవంబర్‌లో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండేది. కోర్టులో ఈ అంశం ఉండటంతో కొంత ఆలస్యమైంది. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచడంతో కోర్టులో జాప్యం జరుగుతూ వచ్చింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రతాప్‌రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఈ ఆలస్యం జరిగింది. నిజానికి మా పార్టీకి ప్రచారం చేసుకునేందుకు ఎక్కువ సమయం కావాలి. ఎందుకంటే మేం ప్రచారం చేయడానికి బోలెడన్ని అంశాలు ఉన్నాయి అన్నారు సజ్జల.

 

 

" గతంలో దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం, పార్టీ అధికారంలోకి రాగానే తొలి రెండు, మూడు నెలల్లోనే మేనిఫెస్టోలని హామీలన్ని పూర్తి చేయలేదు. కేవలం ఒక్క వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే అది చేయగలిగింది. వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు. సమాజంలో మార్పులు తెచ్చే విధంగా పాలన చేస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి సీఎం వైయస్‌ జగన్‌ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు సజ్జల.

మరింత సమాచారం తెలుసుకోండి: