అవును.. కరోనా సెంచరీ కొట్టేసింది. మొదట్లో చైనాకే పరిమితం అనుకున్న ఈ మహమ్మారి ఇప్పుడు పంజా విసురుతోంది. క్రమంగా ఒక్కో దేశానికి వ్యాపిస్తూ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వంద దేశాలకు వ్యాపించేసింది. తాజా గణాంకాల ప్రకారం 100 దేశాల్లోని లక్షా పది వేల మందికి పైగా ప్రజలకు ఇది సోకింది.

 

 

అంతే కాదు.. కరోనా కారణంగా ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య దాదాపు 4 వేలకు చేరువవుతోంది. ఇక నిన్న మొన్నటి వరకూ చైనా ను వణికించిన ఈ భూతం ఇప్పుడు అక్కడ కాస్త జోరు తగ్గించింది. కానీ కొత్తగా వచ్చిన ఇరాన్, ఇటలీల్లో మాత్రం విజృంభిస్తోంది. ఇరాన్‌లో సోమవారం ఒక్కరోజే ఏకంగా 600 మందికి కొత్తగా వ్యాధి సోకింది. ఇక్క సోమ వారం ఒక్క రోజే 49 మంది తాజాగా చనిపోయారు. ఇప్పటి వరకూ ఈ దేశంలో చనిపోయిన వారి సంఖ్య 240కు చేరింది.

 

 

అయితే కరోనా కొందరు ఖైదీల పాలిట వరంగా మారింది. కరోనా ప్రబలంగా ఉండడంతో దాదాపు 70వేల మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేశారు. వీరెవ్వరూ సమాజంలో కరోనా వ్యాప్తికి తెగబడకుండా చర్యలు తీసుకున్నట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి ప్రకటించారు. దీంతో కరోనా కారణంగా ప్రపంచమంతా వణికిపోతుంది.. ఈ ఖైదీలు మాత్రం బతుకు జీవుడా అంటూ జైళ్ల నుంచి బయటపడ్డారు. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు.

 

 

అయితే ఇది తాత్కాలికంగా విడుదల చేయడమే.. మళ్లీ కరోనా కంట్రోల్లోకి వచ్చాక వీరిని జైళ్లలో వేసే అవకాశం ఉంది. మరోవైపు మరో దేశం ఇటలీలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అక్కడ ఒక్క రోజులోనే 133 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 366 దాటింది. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 7375 దాటింది. అందుకే.. దేశ సరిహద్దులు మూసేశారు. ఎక్కడికక్కడ రవాణా ఆంక్షలు విధించారు. స్కూళ్లు, జిమ్‌లు, నైట్‌ క్లబ్‌లు, మ్యూజియాలు అన్నీ మూసేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: