ఇద్దరు పారిశ్రామికవేత్తలకు చంద్రబాబునాయుడు రాజ్యసభ స్ధానాలు కేటాయిస్తే రాష్ట్రాన్ని, జనాలను బాగా ముంచేశారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు పారిశ్రామికవేత్తలకు రాజ్యసభ స్ధానాలను కేటాయించాడు. మరి వీళ్ళేం చేస్తారు ? అనే చర్చ రాజకీయవర్గాలతో పాటు జనాల్లో కూడా  మొదలైంది. రాజ్యసభ ఎంపిలంటే అయినకాడికి దోచుకోవటం అందినంత వెనకేసుకోవటమే అని టిడిపి ఎంపిలు నిరూపించారు. సరే దానికి ఫలితంగా కేసులు ఎదుర్కొంటున్నారనుకోండి అది వేరే సంగతి.

 

టిడిపి తరపున తనకు అత్యంత సన్నిహితులు పైగా బినామీలనే ప్రచారంలో ఉన్న సిఎం రమేష్, సుజనా చౌదరిలను చంద్రబాబు రాజ్యసభ ఎంపిలను చేశాడు. నిజానికి వాళ్ళు పారిశ్రామికవేత్తలు కూడా.  పారిశ్రామికవేత్తల నుండి ఎవరైనా ఏమాసిస్తారు ? ఏదో పరిశ్రమలు పెడతారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారని అనుకుంటారు. కానీ వీళ్ళిద్దరు చేసిందేమిటి ? ఒకళ్ళేమో బ్యాంకులను మోసం చేసి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నాడు.  మరొక ఎంపి అడ్డదారుల్లో తమ సంస్ధలకు ఇరిగేషన్ కాంట్రాక్టులు తీసుకుని అంచనా వ్యయాలను పెంచేసి కోట్ల రూపాయలను  దోచేసుకున్నాడు.

 

ఇది చంద్రబాబు ఎంపిల చరిత్ర. ఇపుడు జగన్ కూడా మరో ఇద్దరు పారిశ్రామికవేత్తలను రాజ్యసభ ఎంపిలుగా ఎంపిక చేశాడు. వీళ్ళే రిలయన్స్ కార్పొరేట్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పరిమళ్ ధీరజ్ నత్వాని, రామ్ కీ పరిశ్రమల అధినేత ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి. వీళ్ళు అనుకుంటే తమకున్న రాజకీయ పలుకుబడితో పరిశ్రమలు ఏర్పాటు చేయటం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటం కష్టమేమీ కాదు. చాలామంది జనాలకు ఆయోధ్య రామిరెడ్డి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అదే సమయంలో పరిమళ్ గురించి కూడా తెలియకపోవచ్చు. కానీ రిలయన్స్ పేరు వినని వాళ్ళు మాత్రం ఉండరు.

 

కాబట్టి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో తనకున్న సన్నిహితంతో  పెట్టుబడులు పెట్టిస్తే  రాష్ట్రానికి అంతకన్నా కావాల్సిందేముంది ? ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు, పారిశ్రామికవేత్తల అండ చాలా అవసరం. బహుశా జగన్ కూడా నత్వానికి రాజ్యసభ కేటాయించటంలో ఉద్దేశ్యం ఇదే అయ్యుంటుంది.  చూద్దం మరి వీళ్ళేం చేస్తారో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: