గే యాప్ అడ్డగా దోపీడీలు, మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు నోయిడా పోలీసులు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేకంగా ఉండే యాప్ లను కేంద్రంగా చేసుకుని అమాయక యువకులను మోసం చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా... ఇప్పటికే పదుల సంఖ్యలో యువకులను మోసం చేసి భారీగా దోచుకున్నట్టు తేలింది. గే చాట్ కోసం ఉండే ప్రత్యేక యాప్‌ను ఈ ముఠా తమ ఫోన్లలో ఇన్‌ స్టాల్ చేసుకుని అందులో ఉండే ఇతర గే లతో పరిచయం పెంచుకున్నారు. తర్వాత వారి ద్వారా చాటింగ్ లు చేసి అమాయక యువయులకు గాళం వేశారని విచారణలో తెలుసుకున్నారు.

 

 


తమ స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకున్న గే యాప్ ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకుంటుందీ ముఠా. తర్వాత వారితో చనువుగా మాట్లాడుతూ....చివరికి కలుద్దామని చెప్పి ఏకంత ప్రదేశానికి రమ్మని పిలుస్తారు. తీరా అక్కడికి వెళ్లిన యువకులను అడ్డంగా బుక్ చేసి...వారి నుంచి విలువైన స్మార్ట్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, డబ్బులు, కార్డులను కాజేస్తున్నారు. వీరు గే యాప్‌ల ద్వారానే కాకుండా, గతంలో నేరుగా కూడా దొంగతనాలకు పాల్పడ్డారని విచారణలో తేల్చారు పోలీసులు. తాళాలు వేసున్న ఇళ్లను కొల్లగొట్టి దోచుకున్న కేసులువీరిపై ఉన్నాయని గుర్తించామని చెబుతున్నారు. 

 

 


పర్సనల్ గే చాటింగ్ యాప్‌లో... ఓ వ్యక్తితో గే చాట్ చేసి మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి దందా వ్యవహారం బయట పడింది. ఏకాంతంగా కలుసుకుందామని చెప్పిన నిందితుడు ఓ ప్రదేశంలో తనను కలిశాడని తర్వాత ఈ ఐదుగురు వచ్చి బెదిరించి తనను ఏటీఎం వద్దకు తీసుకెళ్లారని బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు. అంతేకాక, తనతో బలవంతంగా డబ్బు విత్ డ్రా చేయించారని ఫిర్యాదు చేశాడు. తనలా మరెవరూ మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తెచ్చినట్లుగా బాధితుడు వాపోయాడు.

 

 


అరెస్ట్ చేసిన నిందితులను ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. నోయిడాకు పొరుగున ఉన్న బులంద్ షహర్ జిల్లాకు చెందిన వారిగా తేల్చారు. వీరి పేర్లు కపిల్ శర్మ, రాహుల్ సైనీ, అజయ్ శర్మ, రాజ్ కుమార్ అలియాస్ రాజ్ శర్మ, మనీశ్‌ అని తెలిపారు. నోయిడా శివారులోని ఫేజ్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి వీరిని పట్టుకున్నారు పోలీసులు. నిందితులంతా ఒక దొంగిలించిన కారులో పారిపోతుండగా అడ్డుకున్నారు. అయితే ఈ సమయంలో తప్పించుకునేందుకు తమపై నిందితులు కాల్పులు కూడా జరిపారని...తాము తిప్పికొట్టడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కూడా అయ్యాయని చెప్పారు పోలీసులు. వీరి నుంచి రూ.30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రూ.1.14 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: