ఎవరైనా సరే పది రూపాయల సాయం చేస్తే.. దాన్ని వంద రూపాయలుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు..కానీ.. ఇక్కడ చాలా రివర్స్. ఏకంగా కోట్ల కు కోట్లు దానం చేస్తున్నా..ఇది తాము చేశామని చెప్పుకోరు. అబ్బో.. ఎంత మంచి వాళ్లో.. కనీసం పేరు ప్రతిష్టలపై ప్రేమ లేకుండానే కోట్ల రూపాయలు దానం చేస్తున్నారు.. అసలు దానం అంటే ఇదీ అని అప్పుడే ఓ అభిప్రాయానికి రాకండి సుమా.

 

 

ఎందుకంటే.. ఆ దాతలకు అంత సహృదయం లేదు. మరి ఎందుకు కోట్లకు కోట్లు దానం చేస్తున్నారంటారా.. ఇదంతా రాజకీయాల కోసం.. రాజకీయ పార్టీల నుంచి లబ్ది పొందేందుకు ముందస్తుగా చెల్లించే లంచం అని చెప్పొచ్చు. అందుకే.. వారు కోట్ల కు కోట్లు లెక్కా పత్రం లేకుండా పార్టీలకు సమర్పించుకున్నారు. అటు రాజకీయ పార్టీలు కూడా తమకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లు బయటపెట్టడంలేదు. ఈ సమాచారం లేకుండానే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పిస్తున్నాయి.

 

 

అసలు నిబంధనల ప్రకారం.. రూ.20వేలకు పైబడి ఇచ్చిన విరాళాలకు అన్ని వివరాలు ఉండాలి. ఎవరు ఇచ్చారో స్పష్టంగా తెలపాలి కానీ.. పార్టీ అవేమీ పట్టించుకోవడం లేదు. తాజాగా అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ సంస్థ జరిపిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అవేంటంటే.. 2018-19లో అన్ని పార్టీలకు కలిపి రూ.2,512.98 కోట్లు వచ్చాయి. అందులో భాజపాకు అందినవి రూ.1,612.04 కోట్లు. కాంగ్రెస్‌కు లభించినవి రూ.728.88 కోట్లు.

 

 

ఊరూ పేరూ చెప్పకుండా ఇచ్చిన విరాళాల్లో 78 శాతం ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో వచ్చాయి. ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారి చిరునామాలు తెలియవు. వీటి విలువ రూ.1,960.68 కోట్లు. అంటే ఎక్కువ మంది పేర్లు వెల్లడించడానికి ఇష్టపడకుండా ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేస్తున్నారున్నమాట. పేర్లు బయటికి తెలిసేలా బాండ్లు కొన్నది కేవలం రూ.71.44 లక్షలే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: