దేశ‌మంతటా త‌న ప్ర‌తాపం చాటుకుంటున్న క‌రోనా వైర‌స్ విష‌యంలో తెలంగాణ‌లోనూ అల‌ర్ట్ మొద‌ల‌యింది. కీల‌క‌మైన‌, సున్నిత‌మైన ఐటీ ప‌రిశ్ర‌మ‌లో ఒక‌రు ఈ వైర‌స్ బారిన ప‌డ్డార‌ని తేల‌డం, అన‌క నెగ‌టివ్ రావ‌డం తెలిసిన సంగ‌తే. అయిన‌ప్ప‌టికీ ఇటు ప్ర‌భుత్వం అటు ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా స్క్రీనింగ్‌ పరికరాలను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వాటిని పరిశీలించి వైరస్‌ స్కానింగ్‌ విధానాన్ని తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ,విమానాశ్రయంలో ప్రతి ప్రయాణికునికి కొవిడ్‌-19 వైరస్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్ప‌ష్టం చేశారు.

 


శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారని, వారిని స్కానింగ్‌ చెయ్యడం తప్పనిసరి అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులోని నాలుగు ప్రధానదారుల వద్ద ప్రయాణికులను స్కానింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. . ఎవరికైనా వైరస్‌ లక్షణాలుంటే.. విమానాశ్రయంలోని ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లి, ఆ వ్యక్తికి పూర్తిగా మాస్కులువేసి ప్రత్యేక ద్వారం నుంచి గాంధీ దవాఖానకు తరలిస్తారనిఈట‌ల రాజేంద‌ర్ వివ‌రించారు. ఎయిర్‌పోర్టులో వైద్యులు. నర్సులు, హెల్పర్లు అందుబాటులో ఉంటారని తెలిపిన మంత్రి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు వైద్యుల‌ను సంప్రదించాల‌ని కోరారు.

 

 

మ‌రోవైపు కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనావైరస్‌ కట్టడికి ప్రత్యేకచర్యలు తీసుకోవాలని, వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాజీవ్‌గౌబ సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ వివరించారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగాఉందని, అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నదని  సోమేశ్‌కుమార్‌ కేంద్రానికి తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఏర్పాటు చేసేందుకు రెండు థర్మల్ స్కానర్లను వెంటనే సమకూర్చిన‌ట్లు తెలంగాణ సీఎస్ వెల్ల‌డించారు. అదేవిధంగా ఎన్‌-95 మాస్క్‌లను, కరోనా వైరస్‌ పరీక్షా కేంద్రాలు రెండింటిని వెంటనే ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: