మ‌రో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో స‌ర్కారు డోలాయ‌మాన స్థితిలో ప‌డిపోయింది. అయితే, ఇప్పుడు ప్ర‌త్య‌ర్తి పాలిత పార్టీ రాజ‌కీయాల‌తో కాకుండా అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో స‌ర్కారు మ‌నుగ‌డ‌పై డౌట‌నుమానాలు మొద‌ల‌య్యాయి.  అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య‌నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరుకు ప్రయాణమవ‌డం...వీరిలో ఆరుగురు మంత్రులు ఉండ‌టం..వీరంతా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులే కావ‌డంతో... ఎక్క‌డో తేడా కొట్టేస్తోంద‌ని కాంగ్రెస్ అనుమాన‌ప‌డుతోంది.

 


మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ సార‌థ్యంలో సంకీర్ణ ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. ఇటీవల సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తిరిగిరాగా.. మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రావాల్సి ఉంది. అలాంటి స‌మ‌యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన ఆరుగురు మంత్రులతో క‌లిపి 17 మంది ఎమ్మెల్యేలు హ‌ఠాత్తుగా బెంగ‌ళూరు చేరుకున్నారు.  తిరుగుబాటు వర్గంలో వైద్యశాఖ మంత్రి తులసి సిలావత్‌, కార్మికశాఖ మంత్రి మహేంద్రసింగ్‌ సిసోడియా, రవాణాశాఖ మంత్రి గోవింద్‌సింగ్‌ రాజ్‌పుత్‌, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ఇమార్తిదేవి, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్‌ తోమర్‌, పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రభుర చౌదరి ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దినదినగండంగా కొనసాగుతుండగా.. తాజా పరిణామాలతో కమల్‌నాథ్‌కు పదవీ గండం పొంచి ఉందని స్ప‌ష్ట‌మ‌వుతోంది. 

 


కాగా,  సింధియా వర్గం ఎదురు తిరుగడంతో కాంగ్రెస్ షాక్‌కు గురైంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సోమవారం ఉదయం ఢిల్లీలో సోనియాగాంధీతో భేటీ అవ‌గా....ఈ తిరుగుబాటు అంశం తెలియ‌డంతో...త‌క్ష‌ణ‌మే భోపాల్‌కు చేరుకొని పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం కమల్‌నాథ్‌ తన నివాసంలో అత్యవసర క్యాబినెట్‌ సమావేశం నిర్వహించి సుమారు రెండు గంటలపాటు సమాలోచనలు జరిపారు. క్యాబినెట్‌ సమావేశానికి హాజరైన 20 మంది మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించారని మంత్రి ఉమంగ్‌ సెంగార్‌ తెలిపారు. క్యాబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని సీఎంను కోరామన్నారు. సింధియా ఇప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉన్నారని, కచ్చితంగా ఐదేళ్లు ప‌రిపాలిస్తామని చెప్పారు. కాగా, ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంద‌ని...కాంగ్రెస్ స‌ర్కారు ప‌డిపోయే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: