మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపుగా నూకలు చెల్లినట్లే అనుకోవాలి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అవ్వటం సంచలనంగా మారింది. దశాబ్దాల పాటు సింధియా కుటుంబం కాంగ్రెస్ లోనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది జ్యోతిరాధిత్య మాత్రం మోడితో భేటి అవ్వగానే బిజెపిలో చేరిపోవటం దాదాపు ఖాయమైందనే అనుకోవాలి. అదే నిజమైతే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.

 

230 అసెంబ్లీ సీట్లున్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 116 సీట్లున్నాయి. అలాగే బిజెపికి 106 ఎంఎల్ఏలున్నారు. మరో ఎనిమిది మంది ఇతరులున్నారు. నిజానికి ఏడాది క్రిందట మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జ్యోతిరాధిత్యనే సిఎం అవుతారని అనుకున్నారు. ఎందుకంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు సిధియా పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. అయితే అనూహ్యంగా కమలనాధ్ సిఎం అయిపోయాడు. అప్పటి నుండే పార్టీలో విభేదాలు మొదలయ్యాయి.

 

ఈ నేపధ్యంలో కమల్-సింధియా మధ్య విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయి. దాని ఫలితంగానే సింధియా వర్గంలోని 20 మంది ఎంఎల్ఏలు బెంగుళూరు రిసార్ట్స్ లో క్యాంపు పెట్టారు. దాంతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైనా ఉపయోగం లేకపోయింది. ఒకవైపు రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతుండగానే సింధియా మంగళవారం హఠాత్తుగా మోడిని కలవటంతో సంచలనం మొదలైంది. నిజానికి రాహూల్ గాంధికి సింధియా అత్యంత సన్నిహితుడు. సింధియానే సిఎంగా చేయాలని రాహూల్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

 

మొత్తానికి 15 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చివరకు ప్రభుత్వాన్ని చేతులారా చెడగొట్టుకుంటోంది. యువనేతలకు పెద్ద పీట వేయాలన్న  రాహూల్ ప్రయత్నాలను సీనియర్లందరూ కలిసి దెబ్బ కొట్టటం వల్లే చివరకు రాహూల్ కూడా అధ్యక్ష పదవిని వదులుకోవాల్సొచ్చింది. ఇందులో భాగంగానే యువనేతల్లో కీలకమైన సింధియా కూడా కాంగ్రెస్ ను వదిలేస్తున్నాడు. తండ్రి మాధవరావు సింధియా అడుగుజాడల్లోనే కాంగ్రెస్ బలోపేతానికి జ్యోతిరాధిత్య చాలా కష్టపడ్డాడు.

 

పార్టీ కోసం ఎంత కష్టపడినా ఉపయోగం లేకపోవటంతోనే చివరకు సింధియా పార్టీకి దూరమవుతున్నారు. అంటే సింధియా బిజెపిలో చేరితే అది అధిష్టానం చేతులార ఓ గట్టి యువనేతను దూరం చేసుకున్నట్లే అనుకోవాలి. మధ్యప్రదేశ్ దెబ్బకు ఇతర రాష్ట్రాల్లో కూడా యువనేతలు పార్టీకి దూరమైతే కాంగ్రెస్ పరిస్ధితేమిటి ?

మరింత సమాచారం తెలుసుకోండి: