స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు వరుసగా వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీలు రెహమాన్‌లు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అటు కడప జిల్లాలో సీనియర్ నేతలు రామసుబ్బారెడ్డి, సతీశ్ రెడ్డి, పాలకొండ్రాయుడులు టీడీపీని వీడుతున్నారని, రేపోమాపో వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

 

ఈ క్రమంలోనే బాబుకు మరో భారీ షాక్ తగలనుంది. బాలయ్య స్నేహితుడు కదిరి బాబూరావు కూడా టీడీపీని వీడనున్నారని తెలుస్తోంది. జగన్ సమక్షంలో ఈరోజు వైసీపీ తీర్ధం పుచ్చేసుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే 2014లో ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన బాబూరావు, మొన్న 2019 ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాకపోతే మొన్న ఎన్నికల్లో ఈయన కనిగిరి టికెట్ కోసమే పట్టుబట్టారు.

 

కానీ చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి కనిగిరి సీటు ఇచ్చారు. అదే సమయంలో 2014లో దర్శి నుంచి మంత్రిగా పనిచేసిన శిద్ధా రాఘవరావుని ఒంగోల్ పార్లమెంట్‌కు పంపారు. దీంతో దర్శి సీటులోకి బాబూరావుని పంపారు. ఇక అయిష్టంగానే దర్శి వెళ్ళి పోటీ చేసిన బాబూరావు, వైసీపీ అభ్యర్ధి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో దాదాపు 39 వేలపైనే మెజారిటీతో ఓటమిపాలయ్యారు.

 

ఇక ఓడిపోయిన దగ్గర నుంచి బాబూరావు టీడీపీలో యాక్టివ్‌గా లేరు. అటు నియోజకవర్గంలో కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారిపోతారని వార్తలు వచ్చాయి. అయితే తాను పార్టీ మారనని, బాలయ్యతోనే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు.  కానీ స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, వరుసగా టీడీపీ నేతలు వైసీపీలోకి క్యూ కట్టిన నేపథ్యంలో బాబూరావు కూడా జంప్ అవ్వడం ఖాయమని తెలిసింది. ఈరోజే ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: