స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీ వ్యాప్తంగా టీడీపీలో ఉన్న లుక‌లుక‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్ చార్జ్‌లు లేని చోట చంద్ర‌బాబు కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులోనూ పార్టీ నాయక‌త్వాన్ని మార్చేశారు. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ చ‌రిత్ర చూస్తే ఇక్క‌డ 2009లో లింగారెడ్డి గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ గెలిచిన సింగిల్ సీటుఇదే. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న లింగారెడ్డికి కాకుండా మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డికి 2014లో ప్రొద్దుటూరు టీడీపీ సీటు ద‌క్కింది. అయితే అప్ప‌ట్లో ఆయ‌న ఓడిపోయిన‌ప్ప‌టికీ, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా కొన‌సాగారు.



ఆయ‌న ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ద‌రాజుల రెడ్డికి.. రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌కు అస్స‌లు పొసిగేది కాదు. 2019లో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డిని కాద‌ని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ద‌క్కింది. లింగారెడ్డి కూడా ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఇక సీఎం ర‌మేష్ బీజేపీలోకి జంప్ చేసేశారు. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉక్కు ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డిని ప్ర‌క‌టించారు. వెంట‌నే లింగారెడ్డి ఓ వీడియో రిలీజ్ చేస్తూ ప్ర‌వీణ్ కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఇన్‌చార్జ్ అని.. త‌ర్వాత తానే ఇన్‌చార్జ్‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు.



ఇక ప్ర‌వీణ్ అనుచ‌రులు మాత్రం ప్రొద్దుటూరు టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ పూర్తి స్థాయి ఇన్‌చార్జ్ బాధ్య‌త‌ల‌ను ప్ర‌వీణ్‌కే అప్ప‌గించిన‌ట్టు గ‌ట్టిగా చెబుతున్నారు.
ఏదేమైనా ఇక్క‌డ లింగారెడ్డిని ప‌క్క‌న పెట్ట‌డంతో ఆయ‌న రేపో మాపో టైం చూసుకుని టీడీపీకి జెల్ల‌కాయ కొట్టేసి వైసీపీలోకి జంప్ చేస్తార‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లును ఎదుర్కోవాలంటే ఉక్కు ప్ర‌వీణ్‌లాంటి యువ నాయ‌క‌త్వం ఎంతైనా అవ‌స‌ర‌మ‌ని టీడీపీలో ఒక వ‌ర్గం వాదిస్తోంది. ఏదేమైనా నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో ఈ నాయ‌క‌త్వ మార్పు స్థానిక ఎన్నిక‌ల వేళ పార్టీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: