యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఈడీ అరెస్ట్‌ చేయకపోతే అతను కూడా దేశం విడిచి పారిపోయే వాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏం చేశాక అతను విదేశాలకు ఉడాయించాలనుకున్నాడు..? రాణా కపూర్‌ స్కెచ్‌ ఎందుకు ఫెయిలైంది..? 

 

ఒక లలిత్‌ మోడీ, ఒక నీరవ్‌ మోడీ, ఒక విజయ్‌ మాల్యా... వీళ్ల సరసన చేరిపోడానికి సిద్ధమయ్యాడు రాణా కపూర్‌. యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడి హోదాలో అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. అయితే... తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కన్ను పడిందని తెలుసుకోగానే... పెట్టాబేడ సర్దుకుని విదేశాలకు చెక్కేయాలనుకున్నాడు రాణా కపూర్‌.  ఉన్న వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే మూడు ఆస్తుల్ని అమ్ముకుని... విదేశాలకు వెళ్లిపోవాలనేది రాణా కపూర్‌ ప్లాన్‌. 

 

ఢిల్లీలో అత్యంత ధనవంతులు నివసించే ప్రాంతంలో రాణా కపూర్‌ భార్య బిందు పేరు మీద మూడు ఆస్తులున్నాయి. అయితే వాటిని సంపాదించింది కూడా అక్రమ మార్గంలోనే. యస్‌ బ్యాంక్‌ నుంచి అవంతా రియాల్టీ కంపెనీ 500 కోట్లు అప్పు తీసుకుంది. అయితే అప్పు తీర్చలేకపోవడంతో ఆ సంస్థకు చెందిన అమృత షేర్గిల్‌ మార్గ్‌లోని ఆస్తిని రాణా కపూర్‌ భార్యకు చెందిన బ్లిస్‌ అబోడ్‌ సంస్థ కారు చౌకగా కొనేసింది. ముంబైకి చెందిన ఓ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి 380 కోట్ల రూపాయలను సమకూర్చుకుంది బ్లిస్‌ అబోడ్‌. రాణా కపూర్‌ ఒత్తిడి మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ గైడ్‌లైన్స్‌ను తుంగలోకి తొక్కి మరీ అవంతా రియాల్టీ ఆస్తిని బ్లిస్‌ అబోడ్‌కు కట్టబెట్టారు యస్‌ బ్యాంక్‌ అధికారులు. ఇది కాకుండా చాణక్యపురిలో ఒకటి... సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో డిప్లామాటిక్‌ ఎన్‌క్లేవ్‌ మరో ప్రాపర్టీ బ్లిస్‌ అబోడ్‌ పేరు మీద ఉన్నాయి. 


 
తన భార్యకు చెందిన బ్లిస్‌ అబోడ్‌ పేరు మీదున్న 3 ఆస్తుల్ని వెయ్యి కోట్లకు అమ్మి... దేశం నుంచి పారిపోవాలన్నది రానా కపూర్‌ ప్లాన్‌. అయితే... ఆ పని పూర్తి కాకుండానే రానా కపూర్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది.  మరోవైపు... ఎస్‌ బ్యాంక్‌ స్కామ్‌కు సంబంధించి... ఏడుగురిపై cbi లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. అందులో రానా కపూర్‌తో పాటు అతని బిందు రానా కపూర్, వాళ్ల కూతుళ్లు రాధా, రాఖే, రోషిని ఉన్నారు. అలాగే, DHFL ప్రమోటర్ కపిల్ వాధ్వాన్, RKW ప్రమోటర్ ధీరజ్ వాధ్వాన్ లపై లుకౌట్‌ నోటీసులు ఇచ్చింది CBI.  

 

మరోవైపు యస్‌ బ్యాంక్‌ కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టే పనిలో పడ్డారు అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులైన ప్రశాంత్‌ కుమార్‌. ఇప్పటికే ATM సేవలు అందుబాటులోకి వచ్చాయని... బ్యాంక్‌ బ్రాంచీలలో కూడా సేవలందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దుతామని భరోసా ఇస్తున్నారు rbi నియమించిన అడ్మినిస్ట్రేటర్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: