గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నియోజ‌క‌వ‌ర్గం గుంటూరులోని మంగ‌ళ‌గిరి . ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, టీడీపీ త‌ర‌ఫున ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేయ‌డ‌మేదీనికి కార‌ణం. లోకేష్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు రెండు సంవ‌త్స‌రాల పాటు ఎన్నో నియోజ‌క‌వ‌ర్గాలను వెతికి వెతికి చివ‌ర‌కు మంగ‌ళ‌గిరిని ఎంచుకున్నారు. ఎన్నిక‌ల చివ‌రి క్ష‌ణంలో అక్క‌డ పోటీ చేసిన లోకేష్ ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు. ఆళ్ల గ‌త 2014 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 12 ఓట్ల మెజారిటీ కంటే 4 వేల ఓట్ల మెజారిటీని సాధించి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఎన్నిక‌ల్లో లోకేష్ ఓడిపోయినా 9 నెల‌లుగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉంటున్నారు. మంగ‌ళ‌గిరిలో పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు.



అయితే, ఇప్పుడు ఈ ఇద్ద‌రి నాయ‌కుల మ‌ధ్య మ‌రోసారి ప‌రోక్షంగా పోటీ పెరిగింది. ఈ నెల‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌త్తా చాటి త‌న హ‌వా నిలుపుకోవాల‌న ఆళ్ల‌.. కాదు, ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌న స‌త్తా చాటి.. ఏకంగా సీఎం జ‌గ‌న్‌కు బుద్ధి చెప్పాల‌ని లోకేష్‌లు పోటీ ప‌డుతున్నారు. లోకేష్ విష‌యానికి వ‌స్తే.. స్థానికంగా స‌త్తా చాటేందుకు ఇప్ప‌టికే వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దీనికి ఆయ‌న రాజ‌ధాని అంశాన్ని ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. స్థానిక ఎన్నికల్లో అభ్య‌ర్థుల ఎంపిక నుంచిఅంతా ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. పైగా త‌ను ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు టీడీపీ స‌త్తా చాట‌క‌పోతే.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల‌కు త‌న‌కు మార్గం సుగ‌మం కాద‌నే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.



ప్ర‌తి అంశాన్నీ త‌నే ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకుంటున్నారు. ఇక‌, ఇప్ప‌టికే ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుపిస్తున్నారు. ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ఇక‌, ఆళ్ల విష‌యానికి వ‌స్తే..రెండు కార‌ణాలు బ‌లంగా ఆయ‌న‌కు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి రాజ‌ధాని ఎఫెక్ట్‌ను ఎదుర్కొని ఇక్క‌డ వైసీపీని గెలిపించ‌డం, రెండు మంత్రి కావాల‌న్న త‌న ఆశ‌ల‌ను నిజం చేసుకోవ‌డం. రాజ‌ధాని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. అయితే, ఇక్క‌డి రైతులు మూడు రాజ‌ధానుల‌ను కోరుకుంటున్నారంటూ.. ఇటీవ‌ల కొంత‌మందిని వెంట‌పెట్టుకుని వెళ్లి సీఎంను క‌లిశారు. మ‌రి ఇప్పుడు ఇక్క‌డ వైసీపీని గెలిపించుకోక‌పోతే..తాను చెప్పింది వేస్ట్ అవుతుంది.



అదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర  మాట కూడా పోతుంది. ఇక‌, జ‌గ‌నే మంత్రి పద‌వి ఇస్తాన‌ని చెప్పి ఇవ్వ‌లేదు. ఈ విష‌యంలో తాను కూడా ఒత్తిడి చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడు స్థానికంగా స‌త్తాచాటితే.. త‌న కోరిక‌ను జ‌గ‌న్ వ‌ద్ద నేరుగా చెప్పుకొనేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆళ్ల కూడా తీవ్రంగా నే ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన మంగ‌ళ‌గిరిలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి ఎడ్జ్ వ‌చ్చింది. తాడేప‌ల్లిలో వైసీపీ హ‌వా ఉంది. అయితే రాజ‌ధాని స‌మీప గ్రామాల‌ను ఈ రెండు మున్సిపాల్టీల్లో విలీనం చేయ‌డంతో వాళ్లు కోర్టుకెక్కారు. చివ‌ర్లో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ రెండు మున్సిపాల్టీల్లో ఎన్నిక‌ల‌ను వాయిదా వేసింది.



అదే టైంలో ఈ రెండు మున్సిపాల్టీల‌తో పాటు రాజ‌ధాని స‌మీప గ్రామాల‌ను క‌లుపుకుని అమ‌రావ‌తి న‌గ‌ర కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాల‌ని కూడా వైసీపీ ప్ర‌భుత్వం ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అందుకే రాజ‌ధాని గ్రామాల్లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాలేదు. దీంతో ఇప్పుడు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క దుగ్గిరాల మండ‌లంలో మాత్ర‌మే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మరి ఈ మండ‌లంలో ఎంపీపీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు ?  విజ‌యం సాధిస్తారో?  చూడాలి. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం ఈ మండ‌లంలో వైసీపీకే మెజార్టీ వ‌చ్చింది. మ‌రి ఈ సారి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: