విశాఖ గ్రేటర్ ఎన్నికలు ఎగ్జిక్యూటివ్ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. రాజధాని, అభివృద్ధిని వైసీపీ ఫోకస్ చేస్తోంది. అటు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలనే ఆయుధాలుగా మలుచుకుంటోంది.  ఈ ఎన్నికలు వైసీపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకం కాగా... టీడీపీకి కత్తిమీద సాములా తయారైంది. గ్రేటర్ ఎన్నికలలో పాగా వేయటం ఇరు పార్టీలకు కీలక౦గామారింది. వైసీపీ అవునన్నా కాదన్నా విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌కి ఈ ఎన్నికలు రెఫరెండంగానే అటు రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. 

 

అధికార వైఎస్ఆర్‌సీపికి మిగతా ఎన్నికలంతా ఒక ఎత్తయితే... జీవీఎంసీ ఎన్నికలు మరొక ఎత్తు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ వంటి సంచలన నిర్ణయానికి స్థానికుల మద్దతు సంపూర్ణంగా ఉందని, పాలనా వికేంద్రీకరణను ప్రజలు కోరుకుంటున్నారని నిరూపించేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశం. ఒక విధంగా కార్య నిర్వాహక రాజధానికి గ్రేటర్ ఎన్నికలు రెఫరెండంగానే రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో జీవీఎంసీపై ఆధిపత్యం నిలబెట్టుకోవడం అధికారపార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. విజయసాయిరెడ్డి నాయకత్వం, మంత్రి అవంతి పనితీరు వంటి అంశాలతో ఈ ఎన్నికలు ముడిపడి ఉన్నాయి.  అధికార పార్టీ అవునన్నా కాదన్నా... విశాఖ ఎగ్జిక్యూట్ క్యాపిటల్‌పై ఆ ప్రభావం కనిపిస్తుంది.

 

దీనికి తోడు వైఎస్ఆర్సిపికి గతంలో విశాఖ కేంద్రంగా అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. 2014, 2019 ఎన్నికల్లో సిటీపై పట్టు సాధించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం తయారవ్వకపోవడం అధికార పార్టీకి ప్రతికూల అంశం. 

 

 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి వీచినా విశాఖ నగరం నడిబొడ్డున మాత్రం టిడిపి పాగా వేసింది. విశాఖలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాల్లో నాలుగు దిక్కులా MLAలుగా టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. దీంతో ముందు నుంచి వైఎస్ ఆర్ సీపీ విశాఖపై ప్రత్యేక దృష్టి పెడుతూ వచ్చింది. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్రకు ప్రత్యేక పరిశీలకునిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా విశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తొమ్మిది నెలల వ్యవధిలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి జగమోహన్ రెడ్డి. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్  చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ మహానగర అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపనలు చేశారు. విశాఖలో 140 కిలో మీటర్ల మేర పొడువున మెట్రో రైల్ ప్రాజెక్టు పనులకు అడుగులు పడుతున్నాయి. జిల్లాలో లక్ష యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు, మరో 25వేల మందికి టిడ్కో కింద ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

 

ఈ నేపథ్యంలోనే జివిఎంసి ఎన్నికలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. జీవీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విశాఖ తరఫున గిఫ్ట్ గా ఇవ్వాలని జిల్లా వైసీపీ నేతలు తమ క్యాడర్ కు పిలుపునిస్తున్నారు. పైగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవటం ద్వారా విశాఖ పరిపాలనా రాజధానిపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సైతం తిప్పికొట్టిన వాళ్లమవుతామని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర పౌరుషం చూపించేందుకు ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరుతోంది అధికారపార్టీ.

 

పరిపాలన రాజధాని విశాఖకు వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఇక్కడి నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో పొరపాటున మేయర్ గిరి టీడీపీ చేతికి వెళ్తే.. ఇప్పుడున్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లు సైతం తోడై అడుగడుగునా ప్రభుత్వ౦ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయమూ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: