గత కొన్ని రోజుల నుండి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య విబేధాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ఆర్థర్ రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. వైసీపీలో ఇద్దరు నేతల మధ్య పొరపచ్చాలు రావడం జిల్లా వర్గాలతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి కూడా వెళ్లింది. 
 
వైసీపీ పెద్దలు ఇరు నేతల మధ్య సయోధ్య కుదర్చటంతో ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మరోసారి నిరూపించారు. నిన్న ఆర్థర్, సిద్ధార్థరెడ్డి కేక్ తినిపించుకొని ఒక్కటయ్యారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా ఇంఛార్జీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం కర్నూలులోని శిల్పా చక్రపాణిరెడ్డి ఇంట్లో సమావేశమై ఇద్దరు నేతలను పిలిపించి కలిసి మాట్లాడారు. 
 
నిన్న మధ్యాహ్నం నుండి సమావేశం జరగగా సాయంత్రానికి కొలిక్కి వచ్చింది. మంత్రులు ఇద్దరు నేతలను కలిపి ఒక్కటి చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని మంత్రులు ఇరు నేతలకు సూచించారు. కేక్ కట్ చేసి ఇరు నేతలు ఒకరికొకరు తినిపించుకున్నారు. ఎనిమిది నెలులుగా బద్ద శత్రువుల్లా ఉన్న నేతలు కలవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. 
 
ఇరు నేతలు నియోజకవర్గంలోని మండలాలను చెరిసగం పంచుకున్నారు. ఎన్నికలు రావడంతో ఇరు నేతల మధ్య ఉన్న విబేధాలను తొలగించి కలపడంలో అధిష్టానం ప్రయత్నించి సక్సెస్ అయింది. ఎన్నికల ముందు వీరిద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకోవడం, ఎన్నికల బరిలో ఎవరెవరిని నిలబెట్టాలని ఇరు నేతలు వేరువేరుగా సమావేశాలు జరపడం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఇద్దరు నేతలు ఒక్కటి కావడంతో నందికొట్కూరు వైసీపీలో విబేధాలు సమసిపోయినట్లే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: