ఎత్తులకు పై ఎత్తులు వేయడం రాజకీయాల్లో సర్వసాధారణమైన విషయమే. ఇప్పుడు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు 40 ఇయర్స్ పొలిటికల్ ఇండ్రస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కు కూడా దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్ దీనికోసం సామ, బేధ,  దండోపాయాలు అన్ని ఉపయోగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పై చేయి సాధించకుండా ఉండేలా జగన్ ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను తెరపైకి తెస్తున్నారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ గెలుపు ఖాయమని ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా జగన్ కు సమాచారం ఉన్నా.. టిడిపిని మరింత బలహీనం చేసి మరింతగా మెజార్టీ సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

తెలుగుదేశం పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను తమకు ఉపయోగపడతారు అనుకునే వ్యక్తులను గుర్తించి పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మరో మాజీ ఎమ్మెల్యే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. ఇది ఇలా ఉండగా జగన్ కు పులివెందులలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టిడిపి నేత సతీష్ రెడ్డి, దర్శి కి చెందిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో కదిరి బాబురావు చంద్రబాబు వియ్యంకుడు, సినీ నటుడు బాలకృష్ణ కు అత్యంత సన్నిహితులైన వ్యక్తి కావడంతో టీడీపీలో కలవరం మొదలైంది. 


వీరే కాకుండా ప్రతి జిల్లాలోనూ, నియోజకవర్గ స్థాయి నాయకులను పార్టీలో చేర్చుకునే విధంగా జగన్ పావులు కదుపుతున్నాడు. ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచనలు కూడా చేశారు. దీంతో రంగంలోకి దిగిన టిడిపి అసంతృప్తి నేతలతో పాటు, ఆ పార్టీలో ఉన్న బలమైన నేతలు వైసీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి నాయకులు పార్టీని వీడితే ఆ పార్టీ మరింత బలహీన పడుతుందని, ప్రజల్లో టీడీపీ మునిగిపోతున్న నావ అనే అభిప్రాయం ఏర్పడుతుంది అని, అది వైసీపీకి మేలు చేకూరుస్తుందని, జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: