కరోనా వైరస్ పేరు చెబితే చాలు.. ప్రతి ఒక్కరూ గజగజా వణికిపోతున్నారు. రోజురోజుకు వేగంగా కరోనా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినా కేరళలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆది, సోమవారాలలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈరోజు మరో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 
 
కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు కేరళ సీఎం పినరయ్ విజయన్ అత్యవసరంగా కేబినేట్ సమావేశం ఏర్పాటు చేసి థియేటర్లను, పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
కేరళలో 1116 మంది కరోనా అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 31 వరకు కేరళలో పాఠశాలలు బంద్ కానున్నాయి. ఏడో తరగతి పై బడిన విద్యార్థులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయని సమాచారం. ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు ప్రభుత్వపరమైన వేడుకలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ప్రభుత్వం ప్రజలకు మతసంబంధమైన సమావేశాలను నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. పెళ్లిళ్లను వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలని ప్రజలకు సూచించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి సహకరించాలని ప్రభుత్వం కోరింది. కొట్టాయం, ఎర్నాకులం, పతనమిట్ట ప్రాంతాలలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. సీఎం కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు అవసరమని, ప్రజలు సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలని కోరారు. ట్యూషన్ సెంటర్లు, కోచింగ్ కేంద్రాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: