భార‌త‌దేశంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం అంతగా లేదు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేసిన మ‌రుస‌టి రోజు ఓ ప్ర‌ముఖ మెట్రోపాలిట‌న్ న‌గ‌రంల‌, మ‌రో కీల‌క రాష్ట్రంలో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. బెంగళూరులో కొత్తగా 4 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, కేరళ రాష్ట్రంలో మరో 6 కోవిద్‌-19 (కరోనా వైరస్‌) కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధృవీకరించారు. 

 

పొరుగు రాష్ట్రమైన కర్ణాట‌క‌లోని క‌రోనా బాధితుల విష‌యానికి వ‌స్తే కరోనా సమాచారంతోపాటు కరోనా వైరస్‌ బారిన పడిన వారి వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తోంది. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు కర్ణాటక ప్రభుత్వం మీడియా బులెటిన్‌ను విడుదల చేస్తోంది. తాజాగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో కోవిడ్‌-19 నలుగురికి ఉన్నట్లు నిర్దారించామని, వారిని, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఉంచి వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్‌ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, వైరస్‌ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

 

ఇదిలాఉండ‌గా, కేర‌ళ‌లో క‌రోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 12 కు చేరింది. అనుమానితుల సంఖ్య 19కి చేరింది. దీంతో, సీఎం పినరయి విజయన్‌ కీలక ప్రకటన చేశారు. మార్చి 31 వరకు.. ఏడో తరగతి లోపు విద్యార్థులకు క్లాసులు, పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. మిగితా క్లాసుల వారికి షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు జరుగుతాయని సీఎం వివరించారు. ట్యూషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, అంగన్వాడీలు, మదర్సాలు కూడా మార్చి 31 వరకు మూతపడనున్నాయి. ఇదిలాఉండ‌గా, క‌రోనా అనుమానిత బాధితులను ఐసోలేషన్‌ వార్డుల్లో, వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు సీఎం విజ‌య‌న్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: