ఏపీలో ప్ర‌తిప‌క్ష టీడీపీ ఇప్ప‌టికే ఘోర‌మైన ఓట‌మితో విల‌విల్లాడుతోంది. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చంద్ర‌బాబును న‌మ్మ‌ని ప‌రిస్థితి. ఇక ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ పార్టీకి కీల‌క నాయ‌కులు గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి, మ‌రో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే పులివెందుల అంటేనే వైఎస్ ఫ్యామిలీ అడ్డా. అక్కడ 30 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీని ఢీ కొడుతోన్న మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. స‌తీష్‌రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేశారు.



ఇక ఒక్క క‌డ‌ప జిల్లాలోనే ప్రొద్దుటూరు, పులివెందుల‌, క‌డ‌ప‌, రాజంపేట‌, రాయ‌చోటి, రైల్వేకోడూరు లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి క్యాండెట్లు క‌రువ‌య్యారు. జ‌మ్మ‌ల‌మ‌డుగులోనూ అదే ప‌రిస్థితి. ఇక అనంత‌పురం జిల్లాతో పాటు రాయల‌సీమ జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి ఘోరంగా ఉంది. పార్టీ త‌ర‌పున నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు చాలా చోట్ల బ‌ల‌మైన వాళ్లు లేక ఎవ‌రిని పెట్టి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వెళ్లాలో తెలియ‌ని దుస్థితి. ఇక పార్టీకి కంచుకోట‌లు అయిన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స‌త్తెన‌ప‌ల్లి, న‌ర‌సారావుపేట‌, గుంటూరు తూర్పు లాంటి చోట్ల సైతం ఇదే ప‌రిస్థితి ఉంద‌న్న‌ది క‌ఠోర నిజం అనే చెప్పాలి.



ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రం, పోల‌వ‌రం, చింత‌ల‌పూడి తూర్పుగోదావ‌రి జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఇప్పుడున్నంత దారుణ‌మైన ప‌రిస్థితులు ఎప్పుడూ లేవ‌ని పార్టీ సీనియ‌ర్లే ఒకింత ఆవేద‌న‌తో చెపుతున్నారు. కేవ‌లం చంద్ర‌బాబు విధానాలు ప్ర‌జ‌ల్లో ఆయ‌న ప‌ట్ల .. పార్టీ ప‌ట్ల న‌మ్మ‌కం కోల్పోవ‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని వాళ్లు చెపుతున్నారు. మరి ఇంత దారుణ ప‌రిస్థితుల నుంచి పార్టీ ఈ ఎన్నిక‌ల్లో ఎలా ప‌రువు నిలుపుకుంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: