పరిషత్‌ ఎన్నికలకు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో చిత్తూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీలో ఎవరికి వారుగా అశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జడ్పీ చైర్మన్‌ పదవి పెద్దిరెడ్డి అనుచర వర్గానికి దక్కుతుందన్న ప్రచారంతో, ఆశావాహులకు ఏమీ చేయాలో అర్ధం కాని పరిస్ధితి ఏర్పడింది.

 

చిత్తూరు జడ్పీ చైర్మన్‌ పదవిని ఈసారి జనరల్‌ కు కేటాయించింది ప్రభుత్వం..1995లో నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకొచ్చాక జరిగిన ఎన్నికల్లో రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్‌ కల్పించారు.1995లో తొలి విడత స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జడ్పీ చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. దాంతో టీడీపీ నాయకుడైన యు.గోవిందస్వామి జడ్పీ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈయన కార్వేటినగరం జడ్పీటీసీగా గెలుపొందారు. చైర్మన్‌ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కైలాసంపై పోటీచేసి గెలిచారు.

 

2001లో ఈస్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో కాంగ్రెస్‌కు చెందిన రెడ్డెమ్మ చైర్‌పర్సన్‌ పదవిని దక్కించుకున్నారు. ఈమె బైరెడ్డిపల్లె నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు.2006లో జరిగిన మూడో విడత ఎన్నికల్లో ఓసీ జనరల్‌కు కేటాయించగా.. కాంగ్రెస్‌కు చెందిన ఎం.సుబ్రహ్మణ్యం రెడ్డిని పదవి వరించింది. అప్పట్లో సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక ఆసక్తితో కుప్పం ప్రాంతానికి చెందిన ఇయనకు పదవిని కట్టబెట్టారు. వైఎస్‌ చనిపోయాక సుబ్రహ్మణ్యం రెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లిపోయారు. అప్పట్లో జడ్పీ వైస్‌ చైర్మన్‌గా ఉన్న కుమార్‌రాజా ఇన్‌చార్జిగా పనిచేశారు. 

 

2011- 14మధ్య ప్రత్యేకాధికారుల పరిపాలన సాగింది. అప్పటి కలెక్టర్లయిన సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌, రాంగోపాల్‌ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఓసీ మహిళకు కేటాయించడంతో చిత్తూరు జడ్పీటీసీగా గెలుపొందిన గీర్వాణి చైర్‌పర్సన్‌ పదవిని అధిష్ఠించారు. ఇటీవల ఆమె పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం కలెక్టర్‌ అయిన నారాయణ భరత్‌గుప్తా ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్నారు.2014లో జిల్లాలోని 65 స్థానాలకు గాను టీడీపీ 37 జెడ్పిటిసి స్ధానాలను,వైసీపీ 27 స్ధానాలు గెలుచుకుంది....901 ఎంపిటిసి స్ధానాలకు గాను టీడీపీ 459 గెలుచుకోగా,వైసీపీ 387 ,స్వతంత్రులు 55పైగా స్ధానాలకు గెలుచుకున్నారు. 

 

అయితే చిత్తూరు జడ్పీ చైర్మన్‌ పదవిని ఈసారి జనరల్‌ కు కేటాయించింది ప్రభుత్వం. అధికార పార్టీ నుంచీ వి.కోట మండలానికి చెందిన వైసీపీ నేత పీఎం శ్రీనివాసులు అలియాస్‌ వాసు పేరు దాదాపు ఖరారైంది. వాసు అభ్యర్థిత్వానికి అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో వి.కోట జడ్పీటీసీ టికెట్‌ కోసం ఇపుడు వైసీపీలో పోటీ తీవ్రమైంది. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి ఇటీవల మంత్రి పెద్దిరెడిపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. తనకు గత ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వని విషయాన్ని గుర్తు చేస్తూ ఇపుడు జడ్పీ ఛైర్మన్‌గానైనా అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నట్టు సమాచారం.  

 
 
అదే విధంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు సైతం రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు. కిందటి ఎన్నికల సందర్భంగా మండలి సభ్యత్వం కల్పిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిన విషయాన్ని ఎస్సీవీ గుర్తు చేస్తున్నారని, మండలి మనుగడ ప్రశ్నార్ధకమైన నేపధ్యంలో జడ్పీ అధ్యక్ష పదవినైనా ఇవ్వాలని గట్టిగా కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ మంత్రి పెద్దిరెడ్డి ద్వారా గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు తెలుస్తోంది.మరి వీరి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి అనేది అసక్తి మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: