స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయం దక్కించుకోవాలని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారు. అందుకే... పార్టీలో చేరేందుకు ఆసక్తిచూపిన వారికి... వైసీపీ కండువా కప్పేస్తున్నారు. ఇప్పటికే కొందరు పార్టీలో చేరడం ఖాయమైనా... మరికొందరు మాత్రం ఇంకా డైలమాలో ఉన్నారు. వాళ్లు కూడా త్వరలోనే పార్టీలోకి వస్తారని వైసీపీ అంచనా వేస్తోంది.

 

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత... టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే రాజీనామా చేసి పార్టీలోకి వస్తేనే తీసుకుంటామని జగన్‌ చెప్పడంతో ఆగిపోయారని... గేట్లు తెరిస్తే టీడీపీ ఖాళీ కావడం ఖాయమని ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు మొగ్గినా... అనుబంధ సభ్యులుగా ఉంటూ... ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారు. ఇక డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వైసీపీలో చేరిన మరుసటి రోజే... ఎమ్మెల్సీ పదవికి ఆయన ఇచ్చిన రాజీనామాను అమోదించారు. MLAలు, MLCల విషయంలో రాజీనామా అడ్డంకి ఉండటంతో... విపక్షాల్లోని ఇతర నేతలపై వైసీపీ దృష్టిసారించింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో... వారిని పార్టీలో చేర్చుకుంటే వైసీపీకి తిరుగుండదని భావించింది. అందుకే మాజీ ఎమ్మెల్సీ సతీష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావులకు గాలమేసింది. 

 

విపక్షాల నుంచి వైసీపీలోకి మరికొందరు నేతలు వస్తారనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ఆ జాబితాలో మొదట ఉన్న వారి పేరు... పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీలో కీలక నేత అయిన ఆయన కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే తాను టీడీపీలోనే ఉన్నానంటూ రామసుబ్బారెడ్డి వాటిని ఖండించారు. కానీ... పార్టీ మారుతున్నారనే ప్రచారం జరగ్గానే వెళ్లడం లేదంటూ మొదట అందరూ ఖండిస్తారని... ఆ తర్వాత పార్టీ మారడం మామూలేననే చర్చ జిల్లాలో జరుగుతోంది. వైసీపీ నేతలు కూడా ఆయన పార్టీలోకి వస్తారనే నమ్మకంతోనే ఉన్నారు. 

 

రామసుబ్బారెడ్డి కుటుంబానికి కరడుగట్టిన టీడీపీ కుటుంబంగా జమ్మలమడుగులో పేరు. ఆ నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి టీడీపీకి అన్నీ తానై వ్యవహరించేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆదినారాయణరెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి రావడంతో... తన శత్రువుతో ఆయన బలవంతంగా సయోధ్య కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేసినా ఓటమి ఎదురుకావడంతో... తమ బలవంతపు దోస్తీని అటు అనుచరులు, ఇటు ప్రజలు అంగీకరించలేదనే అభిప్రాయానికి వచ్చారు... రామసుబ్బారెడ్డి. అప్పటి నుంచి స్తబ్దుగా ఉంటూ వచ్చిన ఆయన... స్థానిక ఎన్నికలకు ముందు పార్టీ మారుతున్నారంటూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. 

 

ఓవైపు మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, మరోవైపు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి పార్టీలోకి వస్తే... ఇక జిల్లాలో తిరుగుండదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటిదాకా  ఆ ఇద్దరు నేతలే తమకు ప్రధాన ప్రత్యర్థుల్లా ఉన్నారని... వాళ్లే తమతో కలిసిపోతే అటు పులివెందుల, ఇటు జమ్మలమడుగులో ఇక ఎదురే ఉండదని నమ్మకంగా చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా క్లీన్‌స్వీప్‌ చేయొచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

 

కడప, ప్రకాశం జిల్లాలే కాదు... రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ జోరుగా కొనసాగిస్తోంది... వైసీపీ. జనసేనకు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలోనూ చేరని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు... ఇప్పుడు వైసీపీలో చేరారు. విశాఖలో తన కుమార్తె పసుపులేటి దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌, మరికొందరు టీడీపీ, జనసేన నేతలతో కలిసి... ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. వీళ్లు మాత్రమే కాదు... ఏపీలోని పలు జిల్లాల్లో  ప్రతిపక్షాల నుంచి వైసీపీలోకి అన్ని స్థాయిల్లోని నేతలూ వెల్లువలా తరలివస్తున్నారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కచ్చితంగా లాభిస్తుందని వైసీపీ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: