నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు దిట్టని, ఆయన తన విషయంలో ఎంతో నమ్మక ద్రోహం చేశాడని, టిడిపి సీనియర్ నేత, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు అత్యంత ఆప్తులైన కదిరి బాబురావు వ్యాఖ్యానించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు తాను తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వస్తానని కలలో కూడా ఊహించలేదని, తెలుగుదేశం పార్టీతో 34 ఏళ్ల అనుబంధం ఉందని, తన మొదటి ఓటు కూడా టీడీపీకే వేశానని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటే తనకెంతో గౌరవం ఉండబట్టే, చంద్రబాబు ఇంతకాలం తనను మోసం చేసినా, ఆ పార్టీలోనే ఉన్నానని, కానీ ఇప్పుడు బాబు నమ్మకద్రోహం మరింతగా పెరిగిపోయిందని కదిరి వ్యాఖ్యానించారు. 

IHG


కనిగిరి ఎమ్మెల్యే గా ఉన్న తనను మరోచోటికి పంపించారని, ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వైసిపి బలం ఎక్కువగా ఉన్న చోట తాను 12000 మెజారిటీ తో గెలిచానని బాబురావు గుర్తు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో తనకు కనిగిరి కాకుండా, పక్కనే ఉన్న దర్శి నియోజకవర్గ టిక్కెట్ ఇస్తానని చెప్పడంతో తాను అభ్యంతరం తెలిపానని, కానీ చంద్రబాబు కొంత మంది మీడియా ప్రముఖులతో ఉన్న అవసరాల దృష్ట్యా తనకు కనిగిరి నుంచి కాకుండా దర్శి టికెట్ ఇచ్చారని చెప్పారు. అయితే అక్కడ పోటీలో ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ బంధువవుతాడని అతనిపై పోటీ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పినా, చంద్రబాబు వినిపించుకోలేదు అన్నారు.

IHG


 వచ్చే ఎన్నికల్లో కనిగిరి ఇస్తానని, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తానని, అలాగే కనిగిరి ఇంచార్జీ బాధ్యతలు కూడా ఇస్తానని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారని, ఎన్నికల్లో ఓడిపోవడంతో కనిగిరి ఇన్చార్జి బాధ్యతల గురించి అడిగితే దాటవేస్తూ, బాబు నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. తనకు 2014లోనే వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా తాను చేరలేదని బాబు రావు చెప్పారు. తనకు చంద్రబాబు ద్రోహం చేస్తాడని తెలిసినా బాలకృష్ణ మీద ఉన్న గౌరవం తో తాను ఇప్పటివరకు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని చెప్పారు.


 తన విషయంలో బాలకృష్ణ తనకు అండగా నిలిచినప్పటికీ, చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని, అసలు నందమూరి నారా కుటుంబాలకు ఎంతో తేడా ఉంది అన్నారు. 
బాలకృష్ణతో బంధం తెంచుకోడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, కానీ చంద్రబాబు వంటి వ్యక్తుల దగ్గర ఉండడం ఇష్టంలేకనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసాను అని అన్నారు. కానీ 34 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నందుకు గుండెల్లో బాధగా ఉందని బాబురావు వ్యాఖ్యానించారు.
  

మరింత సమాచారం తెలుసుకోండి: