టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆయన చేరిక అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన మొదటి ఓటు తెలుగుదేశం పార్టీకి వేశానని చెప్పారు. టీడీపీలో సభ్యుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నానని అన్నారు. 
 
2014లో చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరి టికెట్ ఇచ్చారని, వైసీపీకి కంచుకోట అయిన ప్రాంతంలో పోటీ చేసి 12,000 ఓట్ల మెజారిటీతో తాను విజయం సాధించానని వ్యాఖ్యానించారు. కనిగిరిలో విజయం సాధించినా 2019 ఎన్నికల సమయంలో తనను మరో నియోజకవర్గానికి మార్చారని చెప్పారు. ఎందుకు అలా చేశారని చంద్రబాబును ప్రశ్నించగా కొందరు పత్రికా సంపాదకులతో ఉన్న ఒప్పందాల వల్ల అలా చేశానని చెప్పారని వ్యాఖ్యలు చేశారు. 
 
కనిగిరి టికెట్ అడిగితే చంద్రబాబు కులాల ప్రస్తావన తీసుకొచ్చాడని చెప్పారు. దర్శిలో పోటీ చేసి ఓడిపోతే కనిగిరి ఇంఛార్జ్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. 2014లో కనిగిరి నియోజకవర్గం నుండి తాను ఎలా గెలిచానని చంద్రబాబును ప్రశ్నించానని... బాబు తన మాట వినాలని ఆదేశించటంతో దర్శి నుంచి పోటీ చేయాల్సి వచ్చిందని చెప్పారు. 
 
తాను టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి చాలా కారణాలు ఉన్నాయని కదిరి బాబూరావు చెప్పుకొచ్చారు. గతంలో వైసీపీ ఆఫర్లు ఇచ్చినా బాలయ్యను చూసి ఇంతకాలం టీడీపీలో ఉన్నానని అన్నారు. అంతటితో ఆగని బాబూరావు బాలకృష్ణ చాలా మంచివారు... అమాయకుడు అని అన్నారు. సీనియర్ ఎన్టీయార్, బాలయ్య తనకు దేవుళ్ల వంటి వారని.... బాలయ్యను చంద్రబాబు ఎలా మోసం చేస్తాడో తనకు తెలియదని వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ మాటకు అస్సలు విలువ లేదని అన్నారు. జగన్ పై నమ్మకంతోనే తాను వైసీపీలో చేరినట్లు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: