కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ అనాథ అయిపోయింది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి మద్ధతు తెలపడంతో ఇక్కడ టీడీపీని నడిపించే నాయకుడే కరువైపోయాడు. ఇన్‌చార్జ్‌ని కూడా నియమించకపోయేసరికి స్థానిక సంస్థల్లో వంశీ దూసుకెళుతున్నారు. 2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ తరుపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే అనూహ్య పరిణామల మధ్య ఆయన, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చెసి, వైసీపీకి మద్ధతు తెలిపారు.

 

ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో వంశీ వైసీపీ అభ్యర్ధులని గెలిపించుకునే పనిలో బిజీగా ఉన్నారు. సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో కలిసి అభ్యర్ధులని ఎంపిక చేస్తూ, ముందుకెళుతున్నారు. ముఖ్యంగా టీడీపీ బలంగా ఉన్న కొన్ని గ్రామాల్లో వైసీపీ తరుపున స్ట్రాంగ్ అభ్యర్ధులని చూస్తున్నారు. అయితే అటు టీడీపీకి దిక్కు ఎవరు లేరు. దీంతో ఇక్కడ టీడీపీ తరుపున నామినేషన్స్ వేయడానికి అభ్యర్ధులే కరువైపోయారు. అక్కడక్కడ ఉన్న లోకల్ నాయకులు మాత్రమే నామినేషన్స్ వేస్తున్నారు.

 

అయితే నామినేషన్ చివరిరోజు కాస్త టీడీపీ నేతలు ముందుకొచ్చే అవకాశముంది. ఇక ఈ నామినేషన్ వ్యవహారాన్ని కాసేపు పక్కనబెడితే, గన్నవరంలో వంశీ తిరుగులేని నేతగా ఉన్నారు. తన మాస్ ఫాలోయింగ్‌తో వైసీపీ అభ్యర్ధులని గెలుపు తీరాలకు చేర్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలాగో నియోజకవర్గంలో ప్రజలకు కోసం తాను హార్డ్ వర్క్  చేస్తుంటారు. అవసరమైతే సొంత డబ్బులతో కూడా పనులు చేయిస్తారు.  అందుకే రెండోసారి కూడా గెలవగలిగారు.

 

ఇక ఇప్పుడు వైసీపీ వైపు ఉండటంతో, ఇంకా ఎక్కువ పనులు చేసుకుంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం చేయడంలో ముందున్నారు. ఇలా కష్టపడటం, పైగా టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం వంశీకి కలిసిరానున్నాయి. నియోజకవర్గంలో దాదాపు 80 శాతం పైగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశముందని తెలుస్తోంది. అటు గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు జెడ్పీటీసీలు కూడా వైసీపీనే గెలవడం ఖాయమంటున్నారు. మొత్తానికి గన్నవరం లోకల్ వార్‌లో వంశీ అదరగొట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: