రాష్ట్ర రాజకీయ రాజధానిగా ఉన్న విజయవాడ కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో దూసుకెళుతున్నాయి. ఈసారి అధికారంలో ఉండటంతో ఎలాగైనా కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని వైసీపీ చూస్తుంటే, వైసీపీకి చెక్ పెట్టి తమ సత్తా ఏంటో చూపించాలని టీడీపీ చూస్తోంది. 64 డివిజన్ల గల విజయవాడ కార్పొరేషన్‌లో హోరాహోరీగా తలపడుతున్నారు.

 

అయితే అధికారంలో ఉండటం వైసీపీకి అడ్వాంటేజ్‌గా మారింది. ఇప్పటికే నగరంలో ఉన్న వెస్ట్ ఎమ్మెల్యే, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్‌లు తమ అభ్యర్ధులని గెలిపించుకునేందుకు కష్టపడుతున్నారు. కాకపోతే  ఈ ముగ్గురు ఎవరికి వారే తమ వర్గం వ్యక్తినే మేయర్‌ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. విష్ణు తన బంధువులకు అవకాశం ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఎవరికి వారు తమ పట్టు నెగ్గాలన్నట్లు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ విధంగా ఉండటం వల్ల వైసీపీకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది.

 

ఇక అటు టీడీపీ నగర నేతలు మరోసారి కార్పొరేషన్ తమ కైవసం చేసుకోడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే  బొండా ఉమా, వంగవీటి రాధాలు తమకు పట్టున్న సెంట్రల్ ప్రాంతంలోని డివిజన్లపై దృష్టి పెట్టారు. ఇటు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన నియోజకవర్గంలోని డివిజన్లలో గెలుపుపై ఫోకస్ పెట్టారు. అటు ఎంపీ కేశినేని నాని, వెస్ట్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌లు కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు.

 

ఇదే సమయంలో టీడీపీ బీసీ అస్త్రాన్ని ప్రయోగించనుందని తెలుస్తోంది. మేయర్ స్థానాన్ని ఓసీ మహిళకు కేటాయించినా...టీడీపీ మాత్రం విజయవాడ మేయర్‌ స్థానానికి బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తుంది. ఇది టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందని అనుకుంటున్నారు. అదే సమయంలో రాజధాని అమరావతి ఉద్యమం కూడా తమకు కలిసొస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరి చూడాలి విజయవాడ కార్పొరేషన్ ఈసారి ఎవరికి దక్కుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: