2019 ఎన్నికల్లో జగన్ హవా ముందు చాలామంది టీడీపీ దిగ్గజాలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీకి అండగా ఉండే కమ్మ సామాజికవర్గ నేతలు దారుణంగా ఓటమిని చవిచూశారు. అయితే అప్పుడు అలా కమ్మ నేతలని మట్టికరిపించిన వైసీపీ ఎమ్మెల్యేలు, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి గట్టి దెబ్బ వేయాలని చూస్తున్నారు. అధికారంలో ఉండటంతో దూకుడుగా పని చేస్తూ, ముందుకెళుతున్నారు.

 

ఇక వైసీపీ ఎమ్మెల్యేలు దూకుడు టీడీపీ కమ్మ నేతలు కాస్త తడబడుతున్నట్లు తెలుస్తోంది. అలా తడబడుతున్న బడా కమ్మ నేతలు ఎవరంటే....గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ళ నరేంద్ర, జి‌వి ఆంజనేయులు, ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్‌లు. మొన్న ఎన్నికల్లో ఈ దిగ్గజ నేతలంతా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేల దూకుడుతో కాస్త ఇబ్బంది పడుతున్నారు.

 

ఇప్పటికే చిలకలూరిపేటలో ప్రత్తిపాటి మీద గెలిచిన విడదల రజనీ సూపర్ ఫాస్ట్‌గా ఉన్నారు. అసెంబ్లీలో గెలిచిన ఊపుతో, లోకల్ బాడీలో కూడా ప్రత్తిపాటికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అటు పొన్నూరులో ధూళిపాళ్ళ మీద గెలిచిన వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి అల్లుడు కిలారు రోశయ్య కూడా పదునైన వ్యూహాలతో పొన్నూరులో మెజారిటీ వైసీపీ అభ్యర్ధులని గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఇక తెనాలిలో ఆలపాటిని ఓడించిన అన్నాబత్తుని శివకుమార్ ముందు నుంచి దూకుడుగా పనిచేస్తున్నారు.

 

మొన్న అమరావతి ఉద్యమం సమయంలో చంద్రబాబుకే సవాల్ విసిరి, హైలైట్ అయ్యారు. ఇప్పుడు లోకల్ బాడీలో కూడా తన సత్తా ఏంటో చూపించాలని రెడీగా ఉన్నారు. అలాగే గురజాలలో యరపతినేని శ్రీనివాసరావుని మట్టికరిపించిన కాసు మహేశ్ రెడ్డి మళ్ళీ తిరుగులేని విజయం అందుకోవడానికి కష్టపడుతున్నారు. ఇక వినుకొండలో జి‌వి ఆంజనేయులుపై గెలిచిన బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడులో కొమ్మాలపాటిని ఓడించిన నంబూరు శంకరరావులు కూడా మళ్ళీ ఇద్దరు టీడీపీ నేతలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. మొత్తానికైతే ఈ బడా కమ్మ నేతలకు మళ్ళీ దెబ్బ పడేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: