ప్ర‌పంచ‌వ్యాప్తంగా కుబేరులు క‌ష్టాలు ఎదుర్కుంటారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు మదుపరులను వెంటాడటంతో దేశీయ మార్కెట్లు మునుపెన్నడూ లేని నష్టాలను చవిచూశాయి. ఉదయం ప్రారంభం నుంచే భారీ నష్టాలు మొదలైయ్యాయి. సమయం గడుస్తున్నకొద్దీ నష్టాల తీవ్రత అంతకంతకూ పెరుగుతూపోగా.. మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. కరోనా వైరస్‌తో వణికిపోతున్న స్టాక్‌ మార్కెట్లను.. సౌదీ అరేబియా చమురు ధరల యుద్ధం చావుదెబ్బ తీసింది. 

 


సోమవారం ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్‌ విలువ 12 శాతానికిపైగా పడిపోయింది. గత పదేళ్ల‌లో ఇదే అతిపెద్ద పతనం కావడం గమనార్హం. రష్యాతో సౌదీ అరేబియా మొదలు పెట్టిన ధరల యుద్ధం...భారత్‌లో ఆర్‌ఐఎల్‌ షేర్లను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 31 శాతం క్షీణించిన నేపథ్యంలో రిలయన్స్‌ షేర్‌ విలువ 12.35 శాతం దిగజారింది. ట్రేడింగ్‌ మొదలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైన ఆర్‌ఐఎల్‌ షేర్‌.. ఒకానొక దశలో రూ.1,094.95 స్థాయిని తాకింది. అయినప్పటికీ తేరుకుని చివరకు రూ.1,113.15 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.7.06 లక్షల కోట్లుగా ఉన్నది. ఇక తాజా నష్టాల మధ్య టీసీఎస్‌ మార్కెట్‌ లీడర్‌గా ఎదిగింది. ఈ సంస్థ మార్కెట్‌ విలువ రూ.7.40 లక్షల కోట్లుగా ఉంది. 

 


గ్లోబల్‌ క్రూడ్‌ మార్కెట్‌ పరిణామాలతో చమురు రంగ షేర్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ అత్యధికంగా 16 శాతానికిపైగా క్షీణించగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్‌ విలువ 12 శాతానికిపైగా పతనమైంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేక చతికిలపడ్డాయి. యెస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటా కొంటామన్న ఎస్బీఐ షేర్‌ విలువ 6 శాతానికిపైగా హరించుకుపోయింది. మరోవైపు ఈ ప్రకటన యెస్‌ బ్యాంక్‌కు కలిసొచ్చింది. రంగాలవారీగా చూస్తే.. అత్యధికంగా ఇంధన రంగ షేర్ల విలువ 9.74 శాతం కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: