షాకుల మీద షాకులు ఇస్తూ కొన‌సాగిన పెట్రో ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఎనిమిది నెలల తర్వాత తొలిసారిగా రూ.71 దిగువకు పడిపోయాయి. గత నెల 27 నుంచి తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు ఇప్పటి వరకు పెట్రోల్‌ రూ.1.42, డీజిల్‌ రూ.1.44 పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 24 పైసలు తగ్గి రూ.70.59కి, డీజిల్‌ ధర 25 పైసలు తగ్గి రూ.63.26 వద్దకు జారుకుంది.  ఆయా నగరాల్లో విధిస్తున్న పన్నుల ఆధారంగా ధరలు మరింత తగ్గనున్నాయి.  హైదరాబాద్‌లో పెట్రోల్‌ 25 పైసలు తగ్గి రూ.75.04కి చేరుకోగా, డీజిల్‌ మరో 27 పైసలు తగ్గి రూ.68.88 వద్ద నిలిచింది. 

 


అయితే, ఈ ధ‌ర‌లు త‌గ్గ‌డం వెనుక ఆస‌క్తిక‌ర కార‌ణాలు ఉన్నాయి. చమురు సరఫరా దేశాల మధ్య ధరల యుద్ధం తీవ్రమవడంతో గ్లోబల్‌ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. 1991 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఇంతటి స్థాయిలో పతనవడంతో అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌ లాంటి దేశాలకు ఇది శుభవార్తలాంటిది. అయితే, దీనికి కార‌ణం క‌రోనా వైర‌స్‌.

 

ఔను. కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రమేణా క్షీణిస్తున్న ముడి చమురు ధరలను నియంత్రించేందుకు ఉత్పత్తిని మరింత తగ్గించాలన్న ప్రతిపాదనపై ఒపెక్‌, దాని భాగస్వామ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సౌదీ అరేబియా ధరల యుద్ధానికి తెరతీయడంతో గ్లోబల్‌ మార్కెట్లో ఇంధన ధరలు కుదేలయ్యాయి. సోమవారం ఏకంగా 20 శాతానికిపైగా పడిపోయాయి. ప్రపంచ ప్రామాణిక బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర ఈ ఒక్కరోజే బ్యారెల్‌కు 9.74 డాలర్లు లేదా 21 శాతం దిగజారింది. 35.52 డాలర్ల వద్ద ట్రేడైంది. ఒకానొక దశలో ధరలు 30 శాతానికిపైగా పడిపోయి బ్యారెల్‌ 31.02 డాలర్లే పలికింది. గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో ధరల క్షీణత ఇదే కావడం గమనార్హం. అటు అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ (డబ్ల్యూటీఐ) క్రూడ్‌ బ్యారెల్‌ విలువ సైతం 32.13 డాలర్లకు పరిమితమైంది. ఒక్కరోజే 9.15 డాలర్లు లేదా 22 శాతం తగ్గింది. 1991 జనవరి తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.

మరింత సమాచారం తెలుసుకోండి: